మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ .. 15మంది మృతి

Maoists killed, encounter, security forces

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకులు గర్జించాయి. తూటాల చప్పుళ్లతో అరణ్యమంతా ప్రతిధ్వనించింది. గంటల తరబడి సాగిన భీకర కాల్పుల్లో 15మంది మావోయిస్టులు మృతి చెందారు. పారిపోయిన మావోయిస్టుల కోసం ప్రత్యేక బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోన అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరింగింది. సుక్మా జిల్లాలోని కుంట, గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో 15 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

గొల్లపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరాలున్నాయన్న పక్కా సమాచరంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. నుల్కతం గ్రామ సమీపంలో మావోయిస్టులు భద్రతా బలగాలకు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య గంటన్నరకు పైగా కాల్పులు చోటుచేసుకున్నాయి.

మావోయిస్టుల కార్యకలాపాలపై నిఘా పెట్టిన ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు మావోయిస్టు ప్రాబల్య అటవీ ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గొల్లపల్లి అటవీప్రాంతంలో దాదాపు 200 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో..ప్రత్యేక బలగాలు అడవిని జల్లెడ పట్టాయి. ఎన్‌కౌంటర్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగాయి. సంఘటనా స్థలంలో 16ఆయుధాలు, మరికొన్ని నాటు తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో కొందరిని గుర్తించిన అధికారులు బంధువులు వస్తే మృతదేహాలను అప్పగిస్తామని చెప్పారు.

గత నెలలో బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8మంది మావోయిస్టులు మృతిచెందారు. వరుస ఎన్‌కౌంటర్లతో తీవ్రంగా నష్టపోయి తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన వేళ.. తాజా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అయితే, మావోయిస్టులు కూడా ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -