భార్య కాపురానికి రాలేదని పసివాళ్ల ప్రాణాలు తీసిన కిరాతకుడు

father, sons, father kills sons

వాడు మనిషి కాదు మృగం. ఆ రాక్షసుడిని తిట్టడానికి మాటలు కూడా సరిపోవు. భార్యమీద కోపాన్ని పసివాళ్లపై చూపించాడు. బలవంతంగా ఎత్తుకెళ్లి ముగ్గురు చిన్నారులను జల సమాధి చేశాడు. బ్రిడ్జిపై నుంచి నీళ్లలోకి విసిరేసి బలితీసుకున్నాడు. అభం శుభం ఎరుగని ఆ పసివాళ్లు ఏం పాపం చేశారు. ఆ తాగుబోతు తండ్రికి పుట్టడమే వాళ్లు చేసిన తప్పా?

అమ్మ ఒడిలో హాయిగా ఆడుకోవల్సిన ముగ్గురు చిన్నారులు కన్నతండ్రి కిరాతకానికి బలయ్యారు. ఈ హృదయవిదారక దృశ్యం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.ఐదేళ్ల వయసున్న సంజయ్, మూడేళ్ల వయసున్న పునీత్, రెండేళ్ల వయసున్న రాహుల్‌ను గుండెలపై పెట్టుకుని చూసుకోవల్సిన ఈ నీచాతి నీచుడు జలసమాధి చేశాడు. ముగ్గురినీ బ్రిడ్జిపై నుంచి నీవా నదిలోకి విసిరేశాడు.

ఈ విషాదం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని నీవా నదిలో చోటుచేసుకుంది. బాలగంగనపల్లికి చెందిన వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా లారీ డ్రైవర్. మొదటి భార్య ఆముదకు పిల్లలు లేరు. దీంతో శెట్టివారిపల్లెకు చెందిన అమరావతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో వేరే ఊళ్లో కాపురం పెట్టిన వెంకటేష్… ఇంటీవలే సొంత ఊరికి వచ్చాడు. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది. దీంతో భర్తపై అలిగిన అమరావతి… ముగ్గురు పిల్లలను తీసుకుని శెట్టివారిపల్లెలోని పుట్టింటికి వెళ్లింది. మద్యానికి బానిసైన వెంకటేశ్వర్లు… భార్యపై పగ పెంచుకున్నాడు. ఫుల్లుగా తాగి ఆదివారం అత్తారింటికి వెళ్లి కాపురానికి రావాలంటూ భార్యతో గొడవపడ్డాడు. ఆమె నిరాకరించడంతో ముగ్గురు పిల్లలను బలవంతంగా ఎత్తుకెళ్లాడు వెంకటేశ్వర్లు.

సోమవారం ఉదయాన్నే భార్య అమరావతికి ఫోన్‌ చేసి రాత్రి ముగ్గురు పిల్లలను బ్రిడ్జిపై నుంచి కిందికి విసిరేశానని చెప్పాడు. వాళ్లు అక్కడే ఉన్నారు… వెళ్లి తెచ్చుకోమని చెప్పి ఫోన్ కట్ చేశాడు. భర్త చెప్పింది విని షాకైన అమరావతి…. తన బంధువులు, స్థానికులను తీసుకుని బ్రిడ్జి కింద నీవా నదిలో వెదికింది. కానీ ముగ్గురు పిల్లలు అప్పటికే జలసమాధి అయ్యారు. ఉబ్బిపోయి వాళ్ల డెడ్ బాడీలు నీళ్లపై తేలాయి. ఈ హృదయవిదారక దృశ్యం చూసి అమరావతి కుప్పకూలిపోయింది.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు నది వద్దకు చేరుకుని చిన్నారుల డెడ్‌ బాడీలను బయటకు తీశారు. పోస్ట్ మార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు వెంకటేశ్వర్లు కోసం గాలిస్తున్నారు.

ముగ్గురు చిన్నారులను కన్నతండ్రే బలితీసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్యపై ఉన్న కోపంతో అభంశుభం తెలియని పసివాళ్ల ప్రాణాలు తీసిన కిరాతకుడిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నీచుడిని కఠినంగా శిక్షించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -