కరుణానిధి పూర్వీకులది ప్రకాశం జిల్లా

karunanidhi-own-distric

కరుణానిధి అంటేనే ఓ కరుడుగట్టిన తమిళ నేత. అయితే ఆయన తమిళుడు కాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కరుణానిధి పూర్వీకులది ప్రకాశం జిల్లా. ఆయన అసలు పేరు దక్షిణామూర్తి. 1924లో తంజావూరు జిల్లా తిరుక్కువలై గ్రామంలో ముత్తువేల్, అంజుగం దంపతులకు ఆయన జన్మించారు. 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న కరుణకు.. సాహిత్యమంటే ప్రాణం. ఉద్యమాలంటే మరీ ఇష్టం. మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు రకరకాల నాటికలు వేసేవారు. 14 ఏళ్ల వయసులోనే హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. కల్లకుడి ప్రాంతంలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. దాల్మియా వాళ్లు మాత్రం ఆ ప్రాంతానికి దాల్మియాపురంగా పేరు మార్చబోయారు. దీంతో కరుణానిధి, ఎంజిఆర్‌లు రైలుపెట్టెలకి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. అప్పడు జరిగిన అల్లర్లు హిందీ వ్యతిరేక ఉద్యమానికి దారి తీశాయ్. ఈ ఘర్షణల్లో ఇద్దరు చనిపోయారు. ఇదే ఆయన రాజకీయ జీవితానికి తొలి మెట్టు. ఈ దృశ్యం మణిరత్నం తీసిన ఇద్దరు సినిమాలో చూడొచ్చు. ఆ సినిమా ఎంజీఆర్, కరుణానిధి జీవితాల ఆధారంగా తీసిందే. అనంతరం కరుణానిధి సినీ, రాజకీయ రంగాల్లోకి ప్రవేశించారు.