ఆమె కోసం ఏమైనా.. 7వేల మొక్కలతో గిటారు వనం

భార్యా భర్తలు.. ఒకరి కోసం ఒకరుగా.. ఆనందం పంచుకుంటూ.. అనురాగాన్ని పెంచుకుంటూ.. ప్రేమా ఆప్యాయతలు కలబోసుకుంటూ.. జీవితం సాగిస్తున్నారు. ఆమె కోసమే అతడు.. అతడి కోసమే ఆమె అన్నంతంగా కష్ట సుఖాలు పంచుకున్నారు. కలిసి కాపురం చేస్తున్నారు. ఆమె కోసం అతడికి ఏమైనా చేయాలనిపించేంతగా వారి వివాహ బంధాన్ని ముడివేసుకున్నారు. అర్జెంటీనాకు చెందిన పెడ్రో మార్టిన్ ఉరెటా, గ్రాసిలా ఎరిజాజ్ భార్యా భర్తలు. వారికి ఓ వ్యవసాయ క్షేత్రం ఉండేది. సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు.  ఆమెకు సంగీతం చాలా ఇష్టం. అందునా గిటార్ వాయించాలంటే మరీ ఇష్టం. ఆ ఇష్టంతోనే ఓ సారి భర్తతో వ్యవసాయ క్షేత్రంలోని కొంత భాగాన్ని ఖాళీగా ఉంచి అక్కడ గిటార్ తరహాలో మొక్కలు పెంచుదామని అడిగింది. అందుకు సరేనంటూ పనులు ప్రారంభించాడు. నలుగురు పిల్లలతో ఆనందంగా సాగిపోతున్న వారి సంసారంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది.

1977లో గ్రాసిలా ఊహించని విధంగా మెదడులోని రక్తనాళాలు చిట్లి మరణించింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని మార్టిన్ ఆమె జ్ఞాపకార్థం వ్యవసాయ క్షేత్రంలో 7 వేల మొక్కలతో గిటార్ వనాన్ని సృష్టించాడు. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న గిటార్ వనం 71 ఏళ్ల వయసున్నమార్టిన్ హృదయంలో పదిల పరుచుకున్న గ్రాసిలా అందమైన రూపం.