పెళ్లి ఇంత బావుంటుందా: రాశీఖన్నా

నటీనటులు సినిమాల్లో కొన్ని పాత్రలు చేస్తూ తమని తాము ఊహించుకుంటారు. అందుకే ఆ పాత్ర బాగా పండుతుంది. ప్రేక్షకుల హృదయంలో చెరగని ముద్ర వేస్తుంది. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వస్తున్న శ్రీనివాస కళ్యాణంలో నటించిన రాశీఖన్నా అలాంటి అనుభూతికే లోనయ్యానంటోంది. సినిమా చిత్రీకరణ సమయంలో తనకు కూడా పెళ్లి చేసుకోవాలనే భావన కలిగిందని తెలిపింది. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలు, పెళ్లి యొక్క పరమార్థం తెలుసుకున్నాని చెప్పింది.

ఉత్తరాది అమ్మాయినైనా సినిమా చేసినన్నిరోజులూ ఓ తెలుగు అమ్మాయిలానే ఫీలయ్యానని తెలిపింది. తొలిప్రేమలోని తన నటనను చూసి దిల్ రాజు గారు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారని, ఇంత మంచి సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేసింది.

తెలుగు పెళ్లిళ్లలో తలంబ్రాలు ఎందుకు పోస్తారు? బాసికం ఎందుకు కట్టుకుంటారు?తలపై జీలకర్ర, బెల్లం ఎదుకు పెడతారు లాంటి ఎన్నో విషయాలన్నీ ఈ సినిమా ద్వారా తెలుసుకున్నానని రాశీ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. భవిష్యత్తులో నేను కూడా ఇలానే నా పెళ్లి చేసుకుంటానేమో అనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఆ అందమైన ఊహని తలచుకుని సిగ్గుల మొగ్గైంది. మరి ఈ సొట్టబుగ్గల చిన్నదాన్ని చేసుకునే వరుడు ఎక్కడ ఉన్నాడో.