ఆ అకౌంట్ నాది కాదు – గంగూలీ

sourav-ganguly-claims-instagram-page-using-his-name-is-fake

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్లలో సెలబ్రిటీల పేరిట నకీలీ ఖాతాలు ఉండడం కొత్తేమీ కాదు.. అయితే ఈ నకిలీ అకౌంట్స్ కారణంగా పలువురు సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కూడా ఈ తలనొప్పి ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరిట ఉన్న అకౌంట్ తనది కాదని గంగూలీ ప్రకటించాడు. దీనిలో వచ్చిన వ్యాఖ్యలకు , తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. గత కొంత కాలంగా sganguly99 పేరు మీద పలు పోస్టులు వస్తున్నాయి. వీటిని దాదానే పోస్ట్ చేస్తున్నాడనుకుని మీడియా వార్తలు కూడా రాసింది. అటు అభిమానులు కూడా భారీసంఖ్యలో ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో దాదా ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రాంలో నా పేరు మీద ఉన్న ఖాతా నుంచి వచ్చిన పోస్టులు నేను చేసేవి కాదు. అసలు అది నా ఖాతా కాదు. ఫేక్‌ ఖాతా. దయచేసి అందులో వచ్చే వార్తలను తీసుకోకండి. ఇన్‌స్టాగ్రాం నిర్వాహకులకు త్వరలోనే ఫిర్యాదు చేస్తానని గంగూలీ ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన భారత్‌,ఇంగ్లాండ్ తొలి టెస్టుపై ఇదే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఆసక్తికర పోస్టులు వచ్చాయి. టెస్ట్ క్రికెట్‌లో విజయాలు సాధించాలంటే జట్టులో ప్రతీ ఒక్కరూ రాణించాలని, తొలి టెస్టులో బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారని, కోహ్లీ గొప్పగా ఆడాడంటూ పోస్ట్ వచ్చింది. అయితే తాజాగా దాదా ఈ ఖాతా తనది కాదని వివరణ ఇచ్చాడు. గంగూలీ ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్‌ టెస్ట్ సిరీస్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -