ముగ్గుర్ని బలి తీసుకున్న వివాహేతర సంబంధం!

illegal affair , son kills father, crime in warngal

గ్యాస్ సిలిండర్ పేలి ఇంటికి నిప్పంటుకుంది. ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఇది పైకి కనిపించే ప్రమాదం. కానీ దీని వెనుక మరో కోణం దాగుంది. ఇది ప్రమాదం కాదు… పక్కా మర్డర్ ప్లాన్. ముగ్గురి బలికి కారణం వివాహేతర సంబంధమే అని తేల్చారు పోలీసులు. కొడుకే కాలయముడయ్యాడు. కన్నతండ్రిపై కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. మరి తండ్రిమీద కోపం ఉంటే మిగతా వాళ్లను ఎందుకు బలితీసుకున్నాడు?

ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ భారీ శబ్దానికి చుట్టుపక్కలవారంతా ఉలిక్కిపడ్డారు. గుప్పుమన్న మంటలు ఇంటిని చుట్టుముట్టాయి. ఇంట్లో ఉన్నవారిని స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాలేదు. మామిండ్ల కుమారస్వామి, రాజమ్మ, సుజాత ఆ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు.

గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అందరూ భావించారు. కానీ పోలీసుల విచారణలో కొత్తకోణం వెలుగుచూసింది. ఇది ప్రమాదం కాదు… పక్కా మర్డర్ ప్లాన్ అని కాప్స్ తేల్చారు. ఈ దారుణానికి ఒడిగట్టింది మరెవరో కాదు… మామిండ్ల కుమారస్వామి పుత్రరత్నమే. మొదటి భార్య కుమారుడు కార్తీక్‌ ఆదివారం అర్థరాత్రి కొందరు స్నేహితులను వెంటేసుకుని వచ్చాడు. వాళ్లతో కలిసి కుమారస్వామి ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టాడు. మంటలు అంటుకోవడంతో ఇంట్లో ఉన్న సిలిండర్ పేలిపోయింది. ఈ దారుణానికి నిద్రిస్తున్న కుమారస్వామి, అతడి రెండో భార్య సుజాత, అతడి తల్లి రాజమ్మ సజీవదహనం అయ్యారు.

ఈ కిరాతకం వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం కంఠాత్మకూర్‌లో జరిగింది. మామిండ్ల కుమారస్వామికి ఇద్దరు భార్యలు. మొదట రాజమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే సుజాతతో సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల మొదటి భార్యతో గొడవలు రావడంతో రెండో భార్య వద్దనే ఉంటున్నాడు. దీంతో ఆగ్రహించిన మొదటి భార్య కుమారుడు కార్తీక్‌… తండ్రిని, అతడి రెండో భార్యను ఖతం చేయాలని స్కెచ్ వేశాడు. ప్లాన్ ప్రకారం ఇంటికి నిప్పు పెట్టి పారిపోయాడు.

అదే ఇంట్లో ఉన్న మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. సిలిండర్ పేలుడు ధాటికి ముగ్గురి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.