దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా బంద్.. నేడు ఎక్కడి బస్సులు అక్కడే!

bus strike

ఇవాళ (మంగళవారం) దేశ వ్యాప్తంగా రవాణా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. ఆటో నుంచి ఆర్టీసీ బస్సు వరకు రోడ్డెక్కే పరిస్థితే లేదు. కేంద్రం తేబోతున్న మోటార్ యాక్ట్ బిల్లుకు వ్యతిరేకంగా కార్మికులు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. MV యాక్ట్ స‌వ‌ర‌ణతో దేశంలోని అన్ని ఆర్టీసీలు నిర్వీర్యం అవుతాయ‌ని.. ర‌వాణా రంగం అస్థవ్య‌స్తంగా త‌యార‌వుతుంద‌ని ఆందోళ‌న వ్యక్తమవుతోంది.

మోటార్ వెహికిల్ చ‌ట్ట‌ సవరణ బిల్లు 2017 ర‌వాణ రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలో ప్రస్తుతం19 కోట్లకు పైగా మోటారు వాహనాలు తిరుగుతున్నాయి. 15 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. కొత్త ఎంవీ యాక్ట్ అమల్లోకి వస్తే చాలామంది ఉపాధి కొల్పోతారనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆటోలు, క్యాబ్ లతో పాటు ఆర్టీసీపై కూడా ప్రభావం ఎక్కువగా వుంటుందని రోడ్డు రవాణా కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.

కొత్త చట్టం వస్తే.. డ్రైవింగ్ చేసే వారికి కఠిన శిక్షలు, పోలీసులు వేధింపులు రెట్టింపు అవుతాయని రవాణ కార్మికుల వాదన. దీనికి నిరసనగా దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. 12 డిమాండ్లతో చేపట్టే సమ్మెలో బీజేపీకి అనుంబంధంగా ఉన్న బీఎంఎస్ మినహా అన్ని యూనియన్లు పాల్గోనున్నాయి. ఆర్టీసీ బస్సులతో పాటు అన్ని ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

కొత్త బిల్లుతో జరిమానా రేట్లు అమాంతం పెరగనున్నాయి. హెల్మెట్ లేకపోతే వెయ్యి.. సీటు బెల్టు పెట్టుకోకపోతే 10 వేలు, బీమా లేకపోతే 2 వేలు, ఓవర్ లోడ్‌కు 20వేలు, డ్రంకన్ డ్రైవ్‌కి 10వేలు, అతి వేగంగా వాహనం నడిపితే 5వేలు జరిమానా విధిస్తారు. పిల్లలు యాక్సిడెంట్ చేస్తే పాతిక వేల జరిమానాతో పాటు తండ్రికి 3ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.