ప్రాణం తీసిన లడ్డు.. నిశ్చితార్థంలో విషాదం..

వివాహ నిశ్చితార్థంలో మొదలైన చిన్న చిన్న గొడవలే చినికి చినికి గాలివానై ప్రాణాలు మీదకు తెస్తున్నాయి. భోజనాల్లో వడించే లడ్డూ గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆనందంగా జరగాల్సిన వేడుకలో విషాదాన్ని నింపింది. అప్పటి వరకు ఎంతో కళకళలాడుతూ సంతోషంగా ఉన్న పెళ్లి వారింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కర్నూల్ జిల్లా కొత్తపల్లి మండలంకు చెందిన మరియమ్మ, ఏసన్న దంపతుల కుమార్తెకు పాములపాడు మండలంకు చెందిన ప్రశాంత్‌తో సోమవారం నిశ్చితార్థం జరిగింది. అనంతరం భోజనాలు వడ్డిస్తున్న జంబులయ్యతో అదనంగా లడ్డూ ఇవ్వాలని తప్ప తాగిన మైకంలో ఉన్న చెన్నయ్య, ఆంజనేయులు గొడవ పడ్డారు.

లడ్డూ కోసం మొదలైన చిన్న గొడవ చినికి చినికి గాలివానై భీకర పోరుకు దారి తీసింది. ‘డబ్ల్యూడబ్ల్యూఈ’ ని తలపించేలా ఉన్న గొడవని అడ్డుకునేందుకు పెళ్లి కుమార్తె సొంత అన్నయ్య కుమార్‌ ప్రయత్నించాడు. ఈ సమయంలో అతనిపై చెన్నయ్య, ఆంజనేయులుతో పాటు సుజాత, మరికొందరు కలిసి దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.