వారి సరసన కోహ్లీ నిలుస్తాడా… ?

vrat kohili

ప్రపంచ క్రికెట్‌లో లార్డ్స్ మైదానం ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ మక్కాగా భావించే ఈ గ్రౌండ్‌లో రికార్డులు నెలకొల్పినా…. విజయాలు సాధించినా ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ప్రతీ ఆటగాడూ లార్డ్స్‌లో శతకం సాధించాలనో , ప్రతీ కెప్టెన్ ఇక్కడ తన జట్టును గెలిపించాలనో కలలు కంటారు. ముఖ్యంగా సాంప్రదాయం టెస్ట్ క్రికెట్‌లో లార్డ్స్ వేదికగా విజయం అందుకుంటే వచ్చే ప్రశంశలు అంతా ఇంతా కాదు. అయితే ఇప్పటి వరకూ భారత టెస్టు క్రికెట్‌ జట్టుకు సారథ్య బాధ్యతలు వహించిన ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో విజయాలను అందుకున్నారు. కపిల్‌దేవ్‌ , ధోనీ మాత్రమే క్రికెట్ మక్కాలో చారిత్రక విజయం సాధించిన కెప్టెన్లు.

ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన భారత్‌ కేవలం రెండింట్లోనే విజయాలు సాధించింది. 11 పరాజయాలు నమోదు చేసుకోగా… నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది. కపిల్‌ దేవ్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలో మాత్రమే భారత్‌ ఇప్పటి వరకు లార్డ్స్‌లో విజయాలు నమోదు చేసుకుంది. 1932లో మొదటిసారి సీకే నాయుడు సారథ్యంలో భారత్‌ లార్డ్స్‌లో తొలి టెస్టు ఆడింది. ఈ టెస్టులో భారత్‌ 158 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 1986లో కపిల్‌ దేవ్ సారథ్యంలో భారత్‌ లార్డ్స్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. అనంతరం 2014లో మహేంద్ర సింగ్‌ ధోనీ నాయకత్వంలో భారత్‌ రెండో సారి లార్డ్స్‌లో గెలుపొందింది. కుక్‌ సారథ్యంలోని ఇంగ్లాండ్‌ను 95 పరుగుల తేడాతో ఓడించింది. మళ్లీ ఇన్నాళ్లకు విరాట్‌ కోహ్లీ నాయకత్వంలో భారత్‌ లార్డ్స్‌ మైదానంలో టెస్టు ఆడబోతోంది. గురువారం నుంచి ప్రారంభంకానున్న ఈ టెస్టులో కోహ్లీ సేన విజయం సాధిస్తుందో లేదో చూడాలి. కెప్టెన్‌గా కోహ్లీ ఈ మైదానంలో విజయం సాధించి కపిల్‌దేవ్‌, ధోనీ సరసన నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.