ప్రారంభమైన కరుణానిధి అంతిమ యాత్ర

karunanidhi final journey

ద్రవిడ ఉద్యమ నేత.. దివంగత మాజీ సీఎం కరుణానిధి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజాజీ హాల్‌ నుంచి ఈ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఐదు గంటల తరువాత మెరీనా బీచ్‌లో కరుణానిధి భౌతిక కాయానికి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కరుణానిధి చివరి చూపు కోసం రాజాజీ హాల్‌కు భారీగా అభిమానులు చేరుకున్నారు. తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తమ ప్రియతమ నేతను చివరి సారి దగ్గర నుంచి చూసేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. కొందరు అత్యూత్సాహంగా బారికేడ్లు దాటి భౌతిక కాయం దగ్గరకు చేరుకునే ప్రయత్నం చేశారు.. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందగా.. 30 మందికిపైగా గాయాలు అయ్యాయి…

కరుణానిధి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం అవ్వడం లేదు. మరోవైపు అదే సమయంలో ప్రముఖులు సైతం భారీగా వచ్చి.. కరుణానిధి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు.. దీంతో భద్రత కల్పించండం పోలీసులకు ఇబ్బందిగా మారింది..

అంతకుముందు కరుణానిధి భౌతిక కాయానికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. రాజాజీ హాల్‌ కు చేరుకున్న ప్రధాని కలైంజ్ఞర్‌కు అంజలి ఘటించారు. భావోద్వేగంతో ఉన్న కనిమొళి, స్టాలిన్‌లను మోడీ ఓదార్చారు. మరోవైపు ప్రధానితోపాటు రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా కరుణానిధి భౌతిక కాయానికి నివాళలర్పించి కుటుంబ సభ్యులు ఓదార్చారు. రాహుల్‌తో పాటు అజాద్‌, ఊమెన్‌ చాంది తదితర నేతలు వచ్చారు. రాహుల్‌తో పాటు ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లు నివాళులర్పించారు..

తమిళనాడు సీఎంతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరుణానిధి భౌతిక కాయానికి నివాళులర్పించారు. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు రాజాజీ హాల్‌కు చేరుకుని నివాళులు అర్పించారు..

వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులతో పాటు, సినిమా స్టార్లు, ఇతర ప్రముఖులు భారీగా కరుణానిధి చివరి చూపు కోసం రాజాజీ హాల్‌కు తరలి వచ్చారు..