‘విరామం ఎరుగకుండా శ్రమించిన నాయకుడు.. ఇదిగో విశ్రమిస్తున్నాడు

తమిళ ప్రజల ఆరాధ్యనేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంతిమయాత్ర కొనసాగుతోంది. రాజాజీహాలు నుంచి వాలాజా రోడ్‌, చెపాక్‌ స్టేడియం, శివానంద రోడ్‌, తంతైపెరియార్‌ రోడ్‌ మీదుగా మెరీనా బీచ్‌ వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. మెరీనా బీచ్‌లోని మాజీ సీఎం అన్నాదురై స్మారక కేంద్రం సమీపంలో అన్నా స్క్వేర్‌ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

బంగారుపూత పూసిన శవపేటికలో కరుణానిధి పార్థీవ దేహాన్ని ఖననం చేయనున్నారు. ‘విరామం ఎరుగకుండా శ్రమించిన నాయకుడు.. ఇదిగో విశ్రమిస్తున్నాడు’ అని శవపేటిక మీద తమిళంలో రాయించారు. భారీగా తరలివచ్చిన డీఎంకే శ్రేణులు, అభిమానుల అశ్రునయనాల మధ్య కరుణానిధి అంతిమయాత్ర కొనసాగుతోంది. తమ అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలతో రాజాజీహాలు పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. కరుణానిధి పార్థీవదేహం సందర్శకులకు కనిపించే విధంగా ప్రత్యేక వాహనంపై ఏర్పాటు చేసి అంతిమయాత్ర కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు భారీగా మోహరించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి పక్కనే కరుణానిధిని ఖననం చేయనున్నారు. మెరీనా బీచ్‌లో మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీఆర్, జయలలితల సమాధులున్నాయి. ఇప్పుడు కరుణానిధి అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నారు. కలైంజ్ఞర్‌ రాజకీయ గురువు, డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై, తన రాజకీయ ప్రత్యర్థి అయిన జయలలిత సమాధుల మధ్యలో కరుణానిధి సమాధి ఉండనుంది.

తమ ప్రియతమ నాయకుడి కడచూపు కోసం ప్రజలు, డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మెరీనా బీచ్‌లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

అంతకుముందు కరుణానిధి భౌతిక కాయానికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. రాజాజీ హాల్‌ కు చేరుకున్న ప్రధాని కలైంజ్ఞర్‌కు అంజలి ఘటించారు. భావోద్వేగంతో ఉన్న కనిమొళి, స్టాలిన్‌లను మోడీ ఓదార్చారు. మరోవైపు ప్రధానితోపాటు రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా కరుణానిధి భౌతిక కాయానికి నివాళలర్పించి కుటుంబ సభ్యులు ఓదార్చారు. రాహుల్‌తో పాటు అజాద్‌, ఊమెన్‌ చాంది తదితర నేతలు వచ్చారు. రాహుల్‌తో పాటు ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లు నివాళులర్పించారు..

తమిళనాడు సీఎంతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరుణానిధి భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, నివాళుర్పించారు