మోడీకి ఆ ముగ్గురూ తొత్తులు.. – మంత్రి కొల్లు రవీంద్ర

misiter, tdp, bjp, kollu

మాటకు మాటతోనే సమాధానం.. విమర్శకు ప్రతి విమర్శతోనే బదులు.. ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.. బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతుండటంతో టీడీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్‌ ఎటాక్‌ చేస్తోంది.

ఏపీలో అవినీతి జరుగుతోందంటూ బీజేపీ నేత జీవీఎల్‌ నర్సింహారావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. జీవీఎల్‌కు మద్దతుగా రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతుంటే.. దమ్ముంటే అవినీతి నిరూపించాలంటూ సవాల్‌ విసురుతున్నారు టీడీపీ నేతలు. కేంద్రం కావాలనే చంద్రబాబుపై జీవీఎల్‌ను ఉసిగొల్పుతోందని మండిపడుతున్నారు.

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. జన్మభూమి పేరుతో రాష్ట్ర ప్రజల సంపదను కార్యకర్తలకు పంచుతున్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

ఇక జీవీఎల్‌ వ్యాఖ్యలపై ప్రభుత్వ వర్గాలు కూడా మండిపడుతున్నాయి. జీవీఎల్‌వి ఊహాజనిత ఆరోపణలుగా కొట్టిపారేశారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు… పీడీ అకౌంట్‌ అంటే ఏంటో జీవీఎల్‌కు తెలుసా అని ప్రశ్నించారు.

నరేంద్రమోడీకి జగన్, పవన్, జీవీఎల్ ముగ్గురు తొత్తులని విమర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే..ఆ ముగ్గురు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని చూస్తున్నారని అన్నారు. ఏపీలో అవినీతి జరుగుతుందని అంటున్న నేతలు దమ్ముంటే నిరూపించాలని అన్నారు.

మొత్తంగా అటు ఢిల్లీలో.. ఇటు ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి పరిస్థితులు చేరాయి.