రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక కోసం హోరా హోరీ…

deputy chairman

హస్తినలో డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికతో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. రాజ్యసభ వేదికగా బలబలాలు నిరూపించుకునేందుకు ఎన్డీఏ, యూపీఏలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రెండు పక్షాల తరుపున అభ్యర్థులు ఖరారు అయ్యారు. కాంగ్రెస్‌ నుంచి విపక్షాల అభ్యర్థిగా బి.కె ప్రసాద్‌ నామినేషన్‌ వేశారు. మొదట ఎన్సీపీ నుంచి వందన చవాన్‌ పేరు ప్రచారంలో ఉంటే.. ఆమె అభ్యర్థిత్వంపై టీఎంసీ, బీఎస్పీలు వ్యతిరేకించాయి. విపక్షాల అభ్యర్థి ఎన్నిక బాధ్యతను కాంగ్రెస్‌కే వదిలేశాయి.. దీంతో కాంగ్రెస్‌ కర్నాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడు బి.కె. ప్రసాద్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. ఆ వెంటనే ఆయన నామినేషన్‌ వేశారు.. మరోవైపు ఎన్డీఏ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ రేసులో ఉన్నారు..

ఎన్డీఏ తరపున జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ డిప్యూటీ చైర్మన్‌ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకు ఓటు వేయాలని కోరుతూ బీహార్‌ సీఎం నితీశ్‌.. ప్రాంతీయ పార్టీల నేతలకు స్వయంగా ఫోన్‌లు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. హరివంశ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే దీనిపై పార్టీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ సమాధానం చెప్పారు..

తెలుగుదేశం పార్టీ విపక్షాలకు మద్దతుగా నిలిచేందుకు సిద్ధమైంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈసీ మెంబర్ గా పోటీచేసిన సీఎం రమేష్ కు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఓటేశాయి. డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్డీయే తరపున పోటీపడుతున్న హరివంశ్ పైనే సీఎం రమేష్ గెలిచారు. ఇప్పుడు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో విపక్షాలతో కలిసి టీడీపీ పనిచేస్తోంది. పైగా ఈ ఎన్నికను టీడీపి కూడా సవాలుగా తీసుకుంది. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధిని ఓడించడం ద్వారా తమకు జరిగిన అన్యాయం మరోసారి గుర్తుచేయవచ్చని టీడీపీ భావిస్తోంది. వైసీపీ ముందుగానే ఎన్డీయే అభ్యర్ధికి ఓటు వేయమని ప్రకటించింది.