కియా లీగ్‌లో స్మృతి మంధాన మెరుపులు

విదేశీ టీ ట్వంటీ లీగ్స్‌లో భారత క్రికెటర్లు ఆడడం తక్కువే. బిజీ షెడ్యూల్ కారణంగా టీమిండియా ఆటగాళ్ళకు బీసిసిఐ అనుమతి ఇవ్వదు. అయితే భారత మహిళల క్రికెట్ జట్టుకు ఏడాది మొత్తం మ్యాచ్‌లు ఉండే అవకాశం లేదు. దీంతో కొందరు మహిళా క్రికెటర్లు విదేశీ లీగ్స్‌లో ఆడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోన్న కియా సూపర్‌లీగ్‌లో ఇద్దరు భారత మహిళా క్రికెటర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. భారత జట్టులో నిలకడగా రాణిస్తోన్న స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌కౌర్‌ మాత్రమే ఈ లీగ్‌కు ఎంపికయ్యారు.

ప్రస్తుతం కియా సూపర్‌లీగ్‌లో స్మృతి మంధాన దూసుకుపోతోంది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఆడినవి ఆరు మ్యాచ్‌లే అయినప్పటికీ ఆమె రికార్డులు కొల్లగొడుతోంది. ఈ లీగ్‌లో ఆమె వెస్ట్రన్‌ స్టోర్మ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన స్మృతి 338 పరుగులు చేసింది. ఇందులో ఒక శతకం, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో సెంచరీతో రెచ్చిపోయిన మందన బ్యాటింగ్ సగటు 85. ఆరు మ్యాచ్‌లలో 39 బౌండరీలు, 19 సిక్సర్లు సాధించింది. ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో ఉన్న స్మృతి టీ20 ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో కొనసాగుతోంది.

ఈ టోర్నీలో 2016లో రన్నరప్‌గా నిలిచిన వెస్ట్రన్‌ స్టోర్మ్‌ జట్టు గత ఏడాది టైటిల్‌ ఎగరేసుకుపోయింది. ప్రస్తుత టోర్నీలో వెస్ట్రన్‌ జట్టు ఆ గ్రూప్‌ పాయింట్ల పట్టికలో మరో జట్టుతో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచిన స్మృతి ఇంకా ఎన్ని రికార్డులు బద్దులకొడుతుందో వేచి చూడాలి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -