డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్డీయే తరపున పోటీపడుతున్న హరివంశ్ పైనే సీఎం రమేష్ విజయం

TDPs-CM-Ramesh-wins-PAC-poll

పెద్దల సభలో ఎవరి బలం ఎంత?.. తేల్చుకోడానికి అధికార విపక్షాలు సిద్ధమవుతున్నాయి. విపక్షాలు నిజంగానే ఏకతాటిపై ఉన్నాయా?.. ఎన్డీఏలో మిత్ర పక్షాలు బీజేపీ వెంటే ఉన్నాయా?.. అన్నింటికీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో సమాధనం లభించనుంది..

తీవ్ర తర్జన భర్జనల మధ్య ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌ ఎంపీ బీకే హరిప్రసాద్‌ బరిలోకి దిగారు. మొదట డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి అభ్యర్థిని నిలబెట్టేందుకు ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆసక్తి చూపించలేదు. ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించే అధికారం కాంగ్రెస్‌కు అప్పగించడంతో.. ఆ పార్టీ హరిప్రసాద్‌ పేరును ఖరారుచేసింది. ఆ వెంటనే ఆయన నామినేషన్‌ వేయడం జరిగిపోయింది. మరోవైపు మరోవైపు ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ కూడా నామినేషన్ వేశారు..

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అయిన హరిప్రసాద్‌ ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. డిప్యూటీ ఛైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రతిపక్షాలు అంగీకరించకపోవడంతో ఈ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయేను ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమై హరి ప్రసాద్‌కు మద్దతు ఇస్తున్నాయి..

ఎన్డీఏ తరపున జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ డిప్యూటీ చైర్మన్‌ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకు ఓటు వేయాలని కోరుతూ బీహార్‌ సీఎం నితీశ్‌.. ప్రాంతీయ పార్టీల నేతలకు స్వయంగా ఫోన్‌లు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. హరివంశ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే దీనిపై పార్టీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ సమాధానం చెప్పారు.. ఇక బీజేడీకి సైతం నితీశ్‌ ఫోన్‌ చేశారు.. ఆ పార్టీ హరి శంకర్‌ నారాయణ్‌కు ఓటేసేందుకు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది..

ఇక తెలుగు దేశం పార్టీ విపక్షాలకు మద్దతుగా నిలవనుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈసీ మెంబర్ గా పోటీచేసిన సీఎం రమేష్ కు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఓటేశాయి. డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్డీయే తరపున పోటీపడుతున్న హరివంశ్ పైనే సీఎం రమేష్ గెలిచారు. ఇప్పుడు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో విపక్షాలతో కలిసి టీడీపీ పనిచేస్తోంది. పైగా ఈ ఎన్నికను టీడీపి కూడా సవాలుగా తీసుకుంది. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధిని ఓడించడం ద్వారా తమకు జరిగిన అన్యాయం మరోసారి గుర్తుచేయవచ్చని టీడీపీ భావిస్తోంది. వైసీపీ ముందుగానే ఎన్డీయే అభ్యర్ధికి ఓటు వేయమని ప్రకటించింది. అయితే ఎన్నికకు ఆ పార్టీ దూరంగా ఉండే అవకాశం ఉంది.