పార్టీకంటే వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే పనిలో వైసీపీ సీనియర్లు

ycp-politics-in-vijayanagaram-distric

విజయనగరం జిల్లా వైసీపీ నేతల్లో వ్యక్తిగత ఇమేజ్ ప్రెస్టీజియస్‌గా మారింది. పార్టీకంటే తమ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకే అక్కడి సీనియర్లు పాట్లు పడుతున్నారు. అధికార పార్టీపై యుద్ధం ప్రకటించి తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన నేతలు విభేధాలతో తమలో తాము గొడవపడుతున్నారు. ఇద్దరు సీనియర్ నేతల మధ్య రాజుకున్న చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు. విజయనగరం జిల్లాలో వైసీపీ సీనియర్ నాయకులుగా ఉన్న ఆ నేతలు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, మరో సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామి. ప్రస్తుతం వీరిద్దరి మధ్య విబేధాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎవరికి వారుగా స్కెచ్‌లు వేసుకుంటుండటంతో విజయనగరం జిల్లా వైసీపీ క్యాడర్‌లో గందరగోళం మొదలైంది. ముందుగా కాంగ్రెస్ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరంలో తనకు తిరుగుండదని భావించారు. ఏడాదికే మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో అసలు రాజకీయం మొదలైంది. అప్పటి వరకు బొత్స, కోలగట్ల మధ్య విబేధాలు చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల నుండి ఆ విబేధాలు బహిర్గతమవుతున్నాయి. దీంతో జిల్లాలో ఆ ఇద్దరు నేతలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉన్నారు.

పార్టీలోనూ, పార్టీ కార్యక్రమాల్లోనూ.. ఓవైపు తనదైన ముద్ర వేసుకునేందుకు.. బొత్స సత్తిబాబు, తన కుటుంబ నాయకులు, అనుచరులతో ముందుండేందుకు ప్రయత్నిస్తుండగా… బొత్స వర్గాన్ని కట్టడి చేసేందుకు పార్టీ పెద్దలకు ఎప్పటికప్పుడు కోలగట్ల ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఒక దశలో స్వయంగా పార్టీ అధినేత జగన్ కలగజేసుకుని సంయమనం పాటించాలని ఇద్దరికీ సూచించారు. అధినేత ముందు వారు తల ఊపినా… తిరిగి జిల్లాకు చేరుకునేసరికి ఎవరి పంతం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విబేధాలు తారాస్థాయికి చేరుకోవడంతో కొద్ది రోజులు పార్టీకి, పార్టీ కార్యకలాపాలకు వీరభద్రస్వామి దూరంగా ఉన్నారు. అప్పట్లో కోలగట్ల పార్టీ మారతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఆ తర్వాత అధినేత సర్ది చెప్పడంతో కోలగట్ల తగ్గారు. అయినా రెండు వర్గాలు ..జిల్లాలో ఎవరి కార్యక్రమాలు వారు వేర్వేరుగా చేసుకుంటూ ముందుకు పోతుండటంతో జిల్లా వైసీపీ కేడర్‌లో కాస్త గందరగోళం నెలకొంది. ఎవరి శిబిరం వారిదే, ఎవరి కార్యక్రమాలు వారివే కావడంతో జిల్లా కార్యకర్తలు మధ్యలో నలిగిపోతున్నారు. ఇటీవల వైయస్ జయంతిని కూడా ఎవరికి వారే నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, పార్టీ మీటింగ్ లు, ధర్నాలు, ర్యాలీలు ఇలా ..పార్టీ కార్యక్రమాలన్నీ వేర్వేరుగా నిర్వహిస్తుంటే ..పార్టీ కార్యకర్తలు ద్వితీయశ్రేణి నేతలు ఎవరి వైపు ఉండాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇటీవలే 2500 కిలోమీటర్లు పాదయాత్రను జగన్ కంప్లీట్ చేసిన నేపథ్యంలో కోలగట్ల మహిళలతో నిర్వహించిన భారీ ర్యాలీకి బొత్స వర్గం దూరంగా ఉండి అదే రోజు మరో కార్యక్రమాన్ని నిర్వహించింది.

రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన, ఇద్దరు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీ స్ధానాన్ని కలిగి కొంత బలంగా ఉన్న విజయనగరం జిల్లాలో .. ఇలా గ్రూపు రాజకీయాలతో నలిగిపోతుండటంతో వైసీపీ క్యాడర్ నిస్తేజానికి గురవుతోంది. ఈ ఇద్దరు సీనియర్ నేతలు కలిసి అందరి నేతలను కలుపుకుని వెళితే జిల్లా వైసీపీకి తిరుగుండదని పార్టీ కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు. బొత్స, కోలగట్ల వర్గాలు ఎవరి దారి వారు చూసుకుంటే… వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కోవడం కష్టతరం అవుతుందని వైసీపీ కార్యకర్తలు లోలోపల మదనపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. ఇప్పటికైనా నాయకులు కలిసి పనిచేస్తారో లేక ఇలానే విభేధాలతో నడుస్తారో చూడాలి.