పుట్టిన గంటలో బిడ్డకు తల్లి పాలు అందిస్తే..

నవమాసాలు మోసి బిడ్డనైతే కంటున్నారు మాతృమూర్తులు. కారణాలు ఏవైతేనేం పుట్టిన వెంటనే పాలు పట్టలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొందరు సిజేరియన్ల కారణంగా పుట్టిన బిడ్డని దూరంగా ఉంచుతుంటే, మరి కొంత మంది తక్కువ వెయిట్‌తో పుట్టడం వల్ల ఇన్‌క్యుబేటర్‌లో ఉంచుతున్నారు. ఆ విధంగా తల్లికి మొదట వచ్చే ముర్రుపాలు బిడ్డకు అందకుండా పోతున్నాయి. అందునా హైదరాబాద్‌లాంటి మహానగరాల్లో చాలా మంది శిశువులు అమ్మపాలకు నోచుకోవడం లేదు.

ఏటా లక్షకు పైగానే ప్రసవాలు జరుగుతుంటే అందులో సగం మందికి మాత్రమే తల్లిపాలు తాగే అదృష్టానికి నోచుకుంటున్నారు. అమ్మపాలు అందని పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బిడ్డ పుట్టిన 24 గంటల్లో 8 నుంచి 10 సార్లు అమ్మ తన స్థన్యాన్ని బిడ్డకు అందించాలి. సిజేరియన్ చేయించుకున్నా కూడా బిడ్డకు అమ్మపాలు అందించే ఏర్పాటు చేయడం చాలా అవసరం. డెలివరీ అయిన గంటలోపు ఇచ్చే పాల వల్ల బిడ్డకు విరోచనం అవుతుంది. ఒకవేళ ఇలా అవడం ఆలస్యమైతే బిడ్డకు ప్రమాదం. ఈ ముర్రుపాలలో మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్ ‘ఎ’, రెటినాల్, బీటాకెరోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా అంది బిడ్డ ఎదుగుదలకు సహకరిస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల వంటివి త్వరగా దరిచేరవు. పాపాయికి పాలు అందించడం ద్వారా డెలివరీ ద్వారా వ్యాకోచించిన గర్భాశయ కండరాలు త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటాయి. రక్తస్రావ సమస్య కూడా అదుపులో ఉంటుంది. తల్లి పాలు అందని పిల్లలో ఉబ్బసవ్యాధి లక్షణాలు ఎక్కువని నిపుణుల పరిశోధనలో తేలింది. కనీసం ఆరు నెలల పాటు బిడ్డకు పాలివ్వడం ఎంతైనా అవసరమంటున్నారు. పలు వ్యాధులు దరిచేరనీయకుండా చూడడమే కాకుండా, ముఖ్యంగా నిద్రలో సంభవించే ఆకస్మిక మరణాలను కూడా అమ్మపాలు అడ్డుకుంటాయని వైద్యులు వివరిస్తున్నారు.

ఉద్యోగాలు చేసే తల్లులు పాలను బ్రెస్ట్ పంప్స్ ద్వారా స్టోర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఆ పాలను ఫ్రిజ్‌లో నుంచి తీసిన అనంతరం చల్లదనం మొత్తం పోయిన తరువాత బిడ్డకు అందించాలి. ఈ ప్రక్రియ విషయంలో అత్యంత శుభ్రత పాటించాలి. తల్లి పాలు అందించడం వలన బిడ్డకు ఎన్ని లాభాలున్నాయో, అంతకంటే ఎక్కువ ప్రయోజనం తల్లికి కూడా ఉంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లుల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. గుండె పని తీరు సక్రమంగా ఉంటుంది. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మధుమేహం, కీళ్ల వ్యాధుల వంటి వాటినుంచి దూరంగా ఉండవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు పెరిగిన బరువు కూడా పాలివ్వడం ద్వారా తగ్గిపోతుంది.

అమ్మ స్లిమ్‌గా అయిపోతుంది. బిడ్డ పుట్టిన రెండు వారాల వరకు రోజుకు 10 సార్లు పాలు ఇస్తే మంచిది. 20, 30 నిమిషాల పాటు రెండు స్థన్యాలనుంచి బిడ్డకు పాలు ఇవ్వాలి. బిడ్డ పుట్టిన ఆరునెలల వరకు ఇతర ఏ ఆహారం అందించకుండా అమ్మ పాలు అందించినా సరిపోతుంది. ఆ తరువాతే అదనపు ఆహారం అవసరమవుతుంది. కొంతమంది తల్లులకు పడదామన్నా పాలు ఉత్పత్తి కావు. గర్భం దాల్చినప్పుడే డాక్టర్లు చెప్పినట్టుగా మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఫలితంగా బిడ్డ పుట్టిన తరువాత పాలు పడకపోవడం లాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయి. ఈ మధ్య నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో తల్లి పాల బ్యాంకు ఏర్పాటు చేశారు. తల్లుల నుంచి సేకరించిన పాలను సురక్షిత చర్యలు చేపట్టి ఇక్కడ నిల్వ ఉంచుతారు. ఇక్కడ డెలివరీ అయిన వారికి ఉచితంగా, బయటివారికి తక్కువ రేటుకి తల్లిపాలు అందిస్తుంటారు.