పేదల కడుపు నింపే ‘రోటీ బ్యాంక్’.. ఆరుగురి మిత్రుల ఆలోచన

ఆకలితో అలమటించే వారికి నాలుగు మెతుకులు దొరికితే ఆ రోజుకి పూట గడిచిందని హమ్మయ్య అనుకుంటారు. పెట్టిన వారిని కూడా ప్రేమగా చూస్తారు. చల్లగా ఉండంటూ దీవిస్తారు. వారి దీవెనలకంటే వారికి కడుపునింపిన ఆనందం ఎంతో తృప్తిని ఇస్తుంది పెట్టినవారికి. ఇలాంటి ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు ఆరుగురు మిత్రులు. ప్రవీణ్ కోచర్, రాజ్ సాఘ్వానీ, అభిషేక్ మిశ్రా రాజేష్ చంద్వానీ, నవీన్‌లు 15 ఏళ్లుగా వారి మితృత్వం కొనసాగుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో వీరంతా వ్యాపారం చేస్తున్నారు. వారి వారి వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉన్నా పదిమదికీ ఉపయోగపడే మంచి పనేదైనా చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తుండేవారు. వారి ఆలోచనలోనుంచి పుట్టిందే రోటీ బ్యాంక్. ఇక్కడ తయారు చేసిన రొట్టెలను ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులతో పాటు వారి బంధువులకు, ఫుట్‌పాత్‌పై నివసించే నిర్భాగ్యులకు ఈ రొట్టెలను అందిస్తుంటారు.

2015లో ప్రారంభమైన ఈ రోటీ బ్యాంక్ ద్వారా కొంతమందికైనా కడుపునింపుతున్నామన్న సంతృప్తి మిగులుతుందంటున్నారు. ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచనను మరికొంత మందికి కలిగిస్తున్నారు ఈ మిత్ర బృందం.