పిల్లాడు ఏడుస్తున్నాడని బలవంతంగా విమానం నుంచి..

british-airways-deplanes-indian-family-over-crying-3-year-old

పిల్లాడు అదేపనిగా ఏడుస్తున్నాడని బలవంతంగా ఓ ఇండియన్‌ ఫ్యామిలీని విమానం నుంచి దించేశారు. ఈ దారుణ ఘటన బ్రిటీష్‌ ఎయిర్‌లైన్స్‌ లండన్‌-బెర్లిన్‌ విమానం(బీఏ 8495)లో చోటు చేసుకుంది. ఈ విషయంపై సదరు పిల్లాడి తండ్రి విమానయాన శాఖ సురేష్‌ ప్రభుకు లేఖ రాశాడు. విమానం టేకాఫ్‌ అవుతుండగా తమ పిల్లాడు భయంతో ఏడ్వడం ప్రారంభించాడు. ఎంతకీ ఏడుపు ఆపలేదు. తమపై అమానుషంగా వ్యవహరించి దిగిపోవాలని క్రూ సిబ్బంది ఒకరు.. గట్టిగా అరవడం ప్రారంభించాడు. చిన్నారిని తన సీట్లోకి వెళ్లాలని గద్దించాడు. దీంతో పసిపిల్లాడు మరింత బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో తమ పక్క సీట్లలో కూర్చున్న ఇతర భారతీయ కుటుంబాలు, పిల్లాడి ఏడుపు ఆపడానికి ప్రయత్నించారని, బిస్కెట్లు ఇస్తూ ఏడుపు ఆపేలా ప్రయత్నించారు. అయితే మళ్లీ వచ్చిన ఆ క్యాబిన్‌ సిబ్బంది.. యూ బ్లడీ.. ఏడుపు ఆపుతావా? లేదా? అంటూ మండిపడ్డాడు. లేకపోతే విండోలో నుంచి బయటకు పడేస్తా అంటూ హెచ్చరించాడని.. పైగా ఇతర ప్రయాణికులకు అసౌకర్యమనే సాకు చూపించి.. బలవంతంగా తమను దింపేశారని అతను మంత్రికి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఈ విషయంపై బ్రిటిష్ ఎయిర్‌లైన్స్‌కు కూడా ఫిర్యాదు చేశాడు పిల్లాడి తండ్రి. దానికి వారు ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని, ఇలాంటి చర్యను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటూ బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ అధికార ప్రతినిధి అన్నారు. సదరు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.