సహనం కోల్పోతున్న టీచర్లు.. స్టూడెంట్ కనుగుడ్డు బయటకు వచ్చేలా..

teacher-beats-up-mercilessly-7-year-old-students-eye-badly-damaged

అమ్మ ఒడి తరువాత బిడ్డకు విద్యాబుద్దులు నేర్పించేది బడి, బడిలోని ఉపాధ్యాయులు.. పిల్లలందర్నీ తమ పిల్లల్లా చూసుకుంటూ అల్లరి చేస్తే మందలిస్తూ సహనానికి మారుపేరుగా ఉంటారు బడిలో మాస్టార్లు. మరి అలాంటి ఉపాధ్యాయులు క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను తీవ్రంగా దండిస్తున్నారు. చేతిలో ఏది ఉంటే అది తీసుకుని పిల్లలను హింసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన రామ్ సింగ్ కుమారుడు లవ్‌కుష్ స్థానిక పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. తరగతి గదిలో పాఠం చెబుతుంటే అల్లరి చేస్తున్నాడని టీచర్ మందలించాడు. అయినా బాలుడు అల్లరి ఆపకపోయేసరికి టీచర్‌కి కోపం నషాళానికి అంటుకుంది. అంతే గబగబా వచ్చి బడబడా బాదేశాడు. దెబ్బలు భరించలేక కొట్టొద్దని ప్రాధేయపడ్డా.. టీచర్ వదల్లేదు. ఈ క్రమంలో బాలుడి కంటి మీద దెబ్బలు బలంగా తగలడంతో కనుగుడ్డు కూడా బయటకు వచ్చింది.
స్కూల్ యాజమాన్యం పరిస్థితిని గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తండ్రి రామ్ సింగ్ వచ్చి విచారించగా ఉపాధ్యాయుడి నిర్వాకం బయటపడింది. తండ్రి వెంటనే బాలుడ్ని ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. పిల్లలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూలు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. మరోవైపు విద్యాశాఖ అధికారులు కూడా ఈ విషయంపై స్పందించారు. విచారణ చేపట్టవలసిందిగా పోలీసుల్ని ఆదేశించారు. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

 

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -