పార్లమెంట్‌లో ఏపీ రాజకీయ శాస్త్రం

AP-POLITICAL-SCIENCE-IN-PARLIAMENT

– తిగుళ్ల రాజశేఖర్

పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. తెలుగువారి గొంతుక బలంగా వినిపించింది. మాట తప్పిన ప్రధాని నరేంద్ర మోడీని వేలెత్తి చూపింది. ఏపీకి చేసిన నమ్మకద్రోహాన్ని చట్టసభ సాక్షిగా టీడీపీ ఎంపీలు కడిగిపారేశారు. అవిశ్వాసం పెట్టడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం చేసిన మోసాన్ని అన్ని పార్టీలకు తెలిసేలా చేసింది. అందరి మద్దతూ కూడగట్టి.. ఏపీకి న్యాయం చేయాలన్న తమ గొంతుకతో మిగతాపార్టీల స్వరం కలిసేలా చేశారు. ఇది ఏపీ సాధించిన విజయమే. కానీ చెవిటివాని ముందు శంఖం ఊదినట్టుగానే ఉంది. హామీలపై ఎన్నిరూపాల్లో ఒత్తిడి తెచ్చినా.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా వ్యవహరించారు బీజేపీ నేతలు. హామీలు నిలబెట్టుకోవడానికి ముందుకురాలేదు. పైగా నిలదీసిన టీడీపీని ఎద్దేవా చేసి మాట్లాడారు మోడీ. చంద్రబాబుకు మెచ్యూర్టీ లేదంటూ… ఆవేశం ఎక్కువంటూ ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు.

చంద్రబాబుకు ఆవేశం ఎక్కువే అయి ఉంటే.. నాలుగేళ్లు సాయం కోసం ఎదురుచూసేవారు కాదు. ఆలోచన లేకుంటే.. నిధులు లేకున్నా.. ఏపీని అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేసేవారు అసలే కాదు. కళ్లముందు వాస్తవాలు కనపడుతున్నా.. చేయూతగా ఉండాల్సిన కేంద్రం… రిక్తహస్తం చూపించింది. విభజన బిల్లు పెట్టినప్పుడు యూపీఏ అన్యాయం చేసిందన్నారు. అధికారంలోకి వస్తే ఆదుకుంటామన్నారు. మరి ఆ హామీలన్నీ ఏమయ్యాయంటే.. బీజేపీ నుంచి సమాధానం లేదు. పైగా ఓ రాష్ట్రానికి రావాల్సిన వాటాలను బ్యాంకు ఖాతాల్లో జమ చేసి.. అక్కడా అవినీతి జరిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు వంటి వాళ్లు కొత్త ఆరోపణలకు శ్రీకారం చుట్టారు. 53వేల కోట్ల రూపాయిల స్కామ్ జరిగిందని బీజేపీ చెబుతోంది. దీనికి ఆధారాలేంటి? నాలుగేళ్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారు? అవినీతి జరుగుతోందని తెలిసి.. బీజేపీ కూడా వాటాలు తీసుకుని మంత్రులను కొనసాగించిందా? దీనికి కమలనాథులు ఇచ్చే సమాధానం ఏంటి? ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా కేంద్రంపై పోరాటం వదిలేసి… రాష్ట్రంపై ఆరోపణలు ఎక్కుపెట్టింది.

బీజేపీ చేసిన ఆరోపణలకు రంగులు అద్ది మరింత కలర్ ఫుల్ గా చూపిస్తోంది. నాడు అవిశ్వాసం పెడితే.. దగ్గరుండి మోడీని గద్దె దించుతామని ప్రగల్బాలు పలికిన జనసేనాని.. జిల్లా యాత్రల్లో ఎక్కడా బీజేపీ వ్యతిరేక స్వరం వినిపించడం లేదు. చంద్రబాబుపై ఆక్రోశం తప్ప. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ప్రశ్నించాల్సింది కేంద్రాన్ని. నాడు వస్తే వంగివంగి దండాలు పెట్టి కౌగిలించుకున్నది మోడీని అని పవన్ కళ్యాణ్ గుర్తించడం లేదా? అంటే ముగ్గురి లక్ష్యం ఒక్కటే.. చంద్రబాబు. అందుకే వారంతా రహస్య మిత్రులేనని తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.

మోడీది మోసమని తెలిసిన తర్వాత కేంద్రంపై పోరాటంలో చంద్రబాబు వెనకడుగు వేయలేదు. అవిశ్వాసం పెట్టారు. రాజ్యసభలో ఢీకొట్టారు. పార్లమెంట్ సమావేశాలే వేదికగా ఆసాంతం కొట్లాడారు. కానీ మిగతా పార్టీల తీరు అలా లేకుండా పోయిందా? జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణల్లో నిజముందా? ఏపీలో అవినీతి జరిగిందనడానికి ఆధారాలేంటి? విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు, పోర్టు అంశాలను మరుగున పడేయడానికే ఈ కొత్త నాటకం అన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.