‘డల్’ రాజు గా మారిన ‘దిల్’ రాజు

‘దిల్’ రాజు ‘డల్’ రాజు గా మారాడు. వరుసగా వస్తోన్న ఫ్లాపులతో దిల్ రాజు దిల్ బేజారవుతోంది. ఇప్పటి వరకూ తనకు తిరుగులేదనుకుంటూ ప్రతి సినిమాకూ పటాస్ లు పేలుస్తోన్న దిల్ రాజుకు శ్రీనివాస కళ్యాణం తిరుగులేని షాక్ ఇచ్చింది. తనేం తీసినా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారనుకున్న అతని ఓవర్ కాన్ఫిడెన్స్ కు ఈ కళ్యాణం బ్రేక్ వేసింది. వేయడమే కాదు.. అతని జడ్జిమెంట్ నూ హేళన చేసేలా దారుణ పరాజయంగా నిలిచింది శ్రీనివాస కళ్యాణం. రామయ్యా వస్తావయ్యా టైమ్ లో వరుసగా ఫ్లాపులు చూశాడు దిల్ రాజు. తర్వాత హిట్స్ లో పడ్డాడు. కొన్నాళ్లుగా డబుల్ హ్యాట్రిక్ కొట్టానని తెగ చెప్పుకుంటోన్న దిల్ రాజుకు నెల రోజుల గ్యాప్ లోనే రెండు షాకులు తగిలాయి. గత నెలలో వచ్చిన లవర్ డిజాస్టర్ అయింది.

ఈ నెల 9న వచ్చిన శ్రీనివాస కళ్యాణం అంతకు మించి అన్నట్టుగా మరో డిజాస్టర్ గా నిలిచింది. దీంతో దిల్ రాజు ఒక్కసారిగా డల్ రాజు అయ్యాడు. నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రతి విషయం తన కనుసన్నల్లో జరిగేలా చూసుకున్నాడు. హీరోకానీ, దర్శకుడు కానీ ఏం మాట్లాడకుండా చూసుకున్నాడు. మొత్తం తనే మాట్లాడాడు. ఆడియో ఫంక్షన్ లో సైతం ఆడియన్స్ తో ‘పెయిడ్ టాకింగా’ అనిపించేలా మాట్లాడించాడు. కానీ రిజల్ట్ రివర్స్ అయింది. కలెక్షన్స్ కంగారు పుట్టిస్తున్నాయి. ఇక్కడే కాదు అటు ఓవర్శీస్ లో కూడా శ్రీనివాస కళ్యాణంకు మినిమం అంటే మినిమం కలెక్షన్స్ కూడా లేవు. దీంతో భారీ తారాగణంతో చాలా హోప్స్ పెట్టుకున్న ఈ సినిమా ఇంత షాక్ ఇచ్చేసరికి ఒక్కసారిగా డల్ అయిపోయాడట దిల్ రాజు.

ఇక ఈ ఫ్లాప్ తో నితిన్ ఫ్లాపుల్లో హ్యాట్రిక్ చూశాడు. అటు దిల్ రాజుకూ హ్యాట్రిక్ తప్పేలా లేదంటున్నారు. త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందుతోన్న ‘హలో గురూ ప్రేమకోసమే’ రిజల్ట్ కూడా తేడా కొడుతుందంటున్నారు. అలా ఏ మాత్రం తేడా వచ్చినా దసరా పండక్కి దిల్ రాజు కూడా హ్యాట్రిక్ కొడతాడు. మొత్తంగా తను హ్యాట్రిక్ కొట్టినా కొట్టకపోయినా.. శ్రీనివాస కళ్యాణం విషయంలో ఎవర్నీ మాట్లాడకుండా అంతా తానే మాట్లాడుకున్న దిల్ రాజు ఇప్పుడీ ఫ్లాప్ ను కూడా తనపై వేసుకుంటాడా లేక దర్శకుడిపై నెడతాడా అనేది చూడాలి.