లాడెన్ కుటుంబాన్ని ప్రపంచానికి చూపించిన డేవిడ్ తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

– దినేష్ ఆకుల, Editor, TV5 

 

9/11. అమెరికా వెన్నులో వణుకు పుట్టించిన రోజు. ఎప్పుడో 2001లో జరిగిన ఘటన. కానీ ఇప్పటికీ ఈ తేదీ చెబితే.. అమెరికాకే కాదు.. ప్రపంచానికీ నిద్రపట్టదు. అంతలా అందరినీ భయపెట్టాడు.. కరుడుగట్టిన ఉగ్రవాది, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు ఒసామా బిన్‌ లాడెన్‌. ఈ దాడి తరువాత లాడెన్ ఎలా ఉంటాడో.. అతడు ఎవరో ప్రపంచానికి తెలిసింది. కానీ లాడెన్ కుటుంబ నేపథ్యం.. ఆయన తల్లి ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. బ్రిటన్ కు చెందిన ‘ది గార్డియన్’ ఆంగ్ల దినపత్రికలో దీనికి సంబంధించిన వివరాలన్నీ ఓ ఇంటర్వ్యూలో వచ్చాయి. దీంతో లాడెన్ తల్లితోపాటు ఆయన ఫ్యామిలీ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడీ ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫోటో జర్నలిస్ట్ డేవిడ్ లివేన్ పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమ్రోగుతోంది. ఆ డేవిడ్ లివేన్.. తన ఇంటర్వ్యూ అనుభవాలను టీవీ5 గ్రూప్ ఎడిటర్ దినేష్ ఆకులతో ఎక్స్ క్లూజివ్ గా పంచుకున్నారు.

ఎవరీ డేవిడ్ లివేన్?

లాడెన్ ను అందరూ చూశారు. కానీ ఆయన తల్లి ఎలా ఉంటారో.. ఆ కుటుంబ నేపథ్యమేంటో ఇప్పటికీ బయటి ప్రపంచానికి తెలియదు. అలాంటి వివరాలను తొలిసారిగా బయపెట్టారు.. డేవిడ్ లివేన్. లాడెన్ తల్లి పేరు ‘అలియా ఘానెమ్’. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నివాసం ఉంటోందీ కుటుంబం. వీళ్ల ఇంటర్వ్యూను సంపాదించడానికి గార్డియన్ ప్రతినిధులు చాలా కష్టపడ్డారు. ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ డేవిడ్ లివేన్ తీసిన ఫోటోలు ఈ ఇంటర్వ్యూకే హైలెట్. ఈ ప్రపంచానికి లాడెన్ తల్లిని తొలిసారిగా పరిచయం చేసింది ఈయన ఫోటోనే. 2001 అటాక్ తరువాత లాడెన్ కుటుంబం బయటి ప్రపంచానికి కనపడలేదు. ఆ తరువాత ఇన్నాళ్లకు లాడెన్ తల్లి అలియా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కొడుకు గురించి మాట్లాడారు.

డేవిడ్ లివేన్ ఓ ఫ్రీలాన్స్ ఫోటో గ్రాఫర్. 2001 నుంచి గార్డియన్ తో కలిసి పనిచేస్తున్నారు. గార్డియన్ తరుపున చాలా ముఖ్యమైన అసైన్ మెంట్లు చేశారు డేవిడ్. తన కెరీర్ లో డీల్ చేసిన ముఖ్యమైన అసైన్ మెంట్లలో ఇదొకటి అని డేవిడ్ చెప్పారంటే.. ఇదెంత కష్టమైన పనో అర్థమవుతోంది. ఇంత స్మార్ట్ వర్క్ చేస్తారు కాబట్టే.. ఆయనకు రెండుసార్లు ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఇయర్ అవార్డ్స్ వచ్చాయి. డేవిడ్ తన ఇంటర్వ్యూ కోసం ఎంత కష్టపడ్డాడో.. అసలా సమయంలో అక్కడున్న పరిస్థితులేంటో.. అందరికీ తెలిశాయి.

 

లాడెన్ తల్లికి కెమెరా అంటే భయమెందుకు?

లాడెన్ తల్లి అలియా.. కెమెరాను ఫేస్ చేయడానికి అస్సలు ఇష్టపడలేదు. దీంతో ఆవిడ ఫోటోలను తీయడానికి డేవిడ్ చాలా ఇబ్బంది పడ్డారు. ఈ కుటుంబం గురించి తెలుసుకోవడానికి, వాళ్లను కెమెరాలో బంధించడానికి చాలా ట్రై చేశారు. ఈ ఇంటర్వ్యూ కోసం దాదాపు రెండు గంటల పాటు వాళ్ల కుటుంబంతో కలిసి ఒకే గదిలో ఉన్నారు.

దినేష్ ఆకుల – సౌదీ అరేబియాలో అత్యంత సంపన్నుల కుటుంబాలలో లాడెన్ కుటుంబం ఒకటి. ఆ నేపథ్యాన్ని ఫోటోలో ఎలా చూపించగలిగారు?

డేవిడ్ లివేన్ – మేం ఇంటర్వ్యూను, ఫోటోలను ఒకే గదిలో తీశాం. ఈ గది చాలా రిచ్ గా కనిపిస్తుంది. సాధారణంగా సంపన్న కుటుంబాలు.. తమ ఇంటికి వచ్చే అతిథులను ఆహ్వానించే గదిలా అది కనిపించింది. ఇల్లంతా చాలా రిచ్ గా ఉంది. ఈ విశాలమైన భవంతిలో రెండు లిఫ్టులు కూడా ఉన్నాయి.

దినేష్ ఆకుల – ఒసామా బిన్ లాడెన్ ఫోటో.. ఓ సాధారణ టేబుల్ పై కనిపించింది. ఆ ఇంట్లో లాడెన్ ది.. ఈ ఒక్క ఫోటోయే ఉందా?

డేవిడ్ లివేన్ – ఆ ఇంట్లో లాడెన్ కు సంబంధించి చాలా ఫోటోలు ఉన్నాయి. కాని వాటిలో ఈ ఫోటో గ్రాఫ్ నచ్చింది. కారణమేంటంటే.. లాడెన్ కు, అతడి తల్లికి మధ్య అనుబంధానికి ప్రతీకగా ఇది కనిపించింది. అందుకే దీనిని ఎంపిక చేసుకున్నాం.

దినేష్ ఆకుల – చాలా ఫోటోలు.. గది కింది భాగంలో కనిపించాయి. అక్కడ పెట్టాలన్న ఆలోచన మీదేనా?

డేవిడ్ లివేన్ – అలియా ఘానెమ్ ను ఫోటోలు తీసే సమయంలో ఆవిడతో పాటు ఫ్రేములో ఒసామాబిన్ లాడెన్ ఫోటో కూడా ఉండాలని భావించాం. అందుకే ఈ ఫోటోను నేలపై ఉంచాం. అలియా నిల్చున్న సమయంలో లాడెన్ ఫోటో ఆమెకు బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంది. కాని అది అవుటాఫ్ ఫోకస్ లో ఉండేటట్టుగా, ఫ్రేములో అలియా స్పష్టంగా కనిపించేటట్టుగా తీయాలని నిర్ణయం తీసుకున్నాను.

దినేష్ ఆకుల – మీరు ఫోటోలు తీసే సమయంలో అలియా ఘానెమ్ ఏమైనా అసహనంగా కనిపించారా?

డేవిడ్ లివేన్ – అలాంటిదేమీ లేదు. కానీ సీరియస్ గా ఉన్నారు. అలాగని అనాసక్తిని ప్రదర్శించలేదు.

 

దినేష్ ఆకుల – ఆవిడను ఫోటో తీయడం మీకు చాలా కష్టంగా అనిపించిందా? వారి కుటుంబం మీకు సహకరించిందా?

డేవిడ్ లివేన్ – అలియా తన ఫోటోలను తీసుకోవడానికి ముందు ఇష్టపడలేదు. నేను ట్రైపాడ్ మౌంటెడ్ కెమెరాతో పాటు భారీగా లైట్లను ఉపయోగించాను. ఈ పరిస్థితి ఆమెకు అసౌకర్యంగా అనిపించి ఉండవచ్చని భావిస్తున్నాను. వారి కుటుంబం బాగానే సహకరించింది. ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. నేను నా వృత్తిలో ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లలో ఇది ఒకటి. కష్టసాధ్యమైన ఫోటోలు తీసే సమయంలో ఎలాంటి ఫలితాలను రాబట్టాలో కొంతమందికి తెలియదు. నాకు నచ్చినట్టుగా అలియా ఫోటోలను తీయడానికి నాకు ఎక్కువ టైమ్ లేదు. కాని నేనేం చేయాలో, ఫోటోలను ఎలా తీసుకోవాలో.. నా లక్ష్యాన్ని ఎలా పూర్తిచేసుకోవాలో ఓ క్లియర్ పిక్చర్ ఉంది.

దినేష్ ఆకుల – మీరు తీసిన ఫోటోలు.. ప్రపంచం దృష్టిని ఇంతలా ఆకర్షిస్తాయని మీరు అనుకున్నారా?

డేవిడ్ లివేన్ – నాకు తెలుసు. ఇది చాలా ముఖ్యమైన ఇంటర్వ్యూగా నేను భావించాను. ఒసామా బిన్ లాడెన్ తల్లి సెప్టెంబరు 11, 2001 దాడుల తర్వాత ఎవరికీ కనిపించలేదు. అసలు ఆవిడ ఎలా ఉంటారనేది ఈ ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు మొదటిసారిగా ఆమె మాట్లాడారు. ఆమె ఎలాంటి విషయాలు మాట్లాడుతారు అన్నదానిపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టాస్కుకు సిద్దమయ్యాను. కొన్నిసార్లు ఒత్తిడి కూడా సృజనాత్మకంగా ఆలోచించేటట్లు చేస్తుంది. కానీ నేను దాన్ని తట్టుకొని ఫోటోగ్రఫీని విజయవంతంగా పూర్తిచేశాను.

దినేష్ ఆకుల – జెడ్డాలో ఉన్న బిన్ లాడెన్ ఇల్లు ఎలా ఉంది? ఆ ఇంటి లోపలికి ప్రవేశించింది మొదలు.. తిరిగి వచ్చేవరకు అక్కడి వాతావరణం ఎలా ఉంది?

డేవిడ్ లివేన్ – నేను, ఈ ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ మార్టిన్ చులోవ్ తో పాటు అందరం తొలుత అసౌకర్యంగా ఫీలయ్యాం. కాసేపటి తరువాత పరిస్థితి సర్దుకుంది. ఆ ఇంట్లో ఉన్నవారికి ఇంటర్వ్యూ, ఫోటోషూట్.. ఇంకా మా హడావుడి.. అంతా కొత్తకొత్తగా అనిపించింది. కొత్తవారితో కలవడానికి ఎవరికైనా కొంత సమయం పడుతుంది. కానీ మేం వారితో కలవడానికి మరీ ఎక్కువ సమయం పట్టలేదు. వారితో కలిసి భోజనం చేయడం వల్ల వాతావరణం తేలికపడింది. అందుకే తొందరగా కలిసిపోగలిగాం.

 

దినేష్ ఆకుల – బిన్ లాడెన్ ఇంట్లో మీరు ఎంత సమయం గడిపారు?

డేవిడ్ లివేన్ – బిన్ లాడెన్ ఇంట్లో మేం దాదాపు రెండు గంటల పాటు ఉన్నాం.

దినేష్ ఆకుల – ఇంటర్వ్యూ, ఫోటోగ్రఫీ కోసం మీరు రావడానికి సంబంధించి, ఆ ఇంట్లో ఉన్నవాళ్లు ఎంత ఆసక్తిని చూపించారు?

డేవిడ్ లివేన్ – వాళ్లు ఎంత ఆసక్తితో ఉన్నారన్నది నేను చెప్పలేను. కాని మాకు సహకరించారు.

దినేష్ ఆకుల – ఈ ఇంటర్వ్యూ కోసం మీరు ఎలా సన్నద్దమయ్యారు?

డేవిడ్ లివేన్ – నా ఫోటో షూట్ కోసం ఎప్పుడూ నేను ఎలాంటి కిట్స్ వాడుతానో.. వాటినే ఉపయోగించాను. నాకు అవసరమైన కెమెరాలు, లెన్సులు, లైటింగ్ యూకే నుంచి వచ్చాయి. ఇవన్నీ నాకు చాలా అవసరమని తెలుసు. వీటి గురించి మరీ ఎక్కువ ఆలోచించకుండా వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగాను.

దినేష్ ఆకుల- ఓ ఫోటో గ్రాఫర్ గా.. ఈ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మీకు గుర్తిండిపోయే అంశమేంటి?

డేవిడ్ లివేన్ – కింద కూర్చుని బిన్ లాడెన్ కుటుంబంతో కలిసి భోజనం చేయడం.. మర్చిపోలేని అనుభవం. ఆ ఇంటిలో భోజనం చేస్తానని అస్సలు ఊహించలేదు. అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందని ఊహించానో నాకది కనిపించలేదు. ప్రపంచం దృష్టిలో లాడెన్ కుటుంబం అపఖ్యాతిని మూటగట్టుకుంది.

దినేష్ ఆకుల – మీరు తీసిన ఈ ఫోటోలకు ఎలాంటి ప్రతిస్పందన వస్తోంది?

డేవిడ్ లివేన్ – నేను తీసిన ఫోటోలకు సానుకూల స్పందన కనిపిస్తోంది. నా ఫోటోలతో పాటు, ఇంటర్వ్యూకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి కారణం.. మేం ఎంచుకున్న అంశంతో పాటు మా సృజనాత్మకతే కారణం.

దినేష్ ఆకుల – ఈ అసైన్ మెంట్ ను ఎంత ముఖ్యమైనదిగా మీరు భావిస్తున్నారు?

డేవిడ్ లివేన్ – దీని గురించి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇది నాకు చాలా ముఖ్యమైనది కావడంతో.. నేను బాగా పనిచేయాలన్న ఒత్తిడి నాపై ప్రభావం చూపించింది. ఓ బాధ్యతాయుతమైన పనిని స్వీకరించి దానిని పూర్తి చేసి సంస్థకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది.