కేసీఆర్‌ సర్కార్‌కు కేంద్రం మరో షాక్

కేంద్రానికి టీఆర్‌ఎస్‌ ఎంత సహకరిస్తున్నా.. కేంద్రం మాత్రం కేసీఆర్‌ సర్కార్‌కు వరుస షాక్‌లపై షాక్‌లు ఇస్తూనే ఉంది. మోడీ పాల‌న సూప‌ర్ అంటూ గులాబీ అధినేత చాలాసార్లు ప్రశంసలు కురిపించారు. ఇక ప్రధాని మోడీ సైతం పార్లమెంట్‌ వేదికగా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని కొనియాడారు. అయితే ఈ బంధం కేవలం మాటలకు.. పొగడ్తలకే పరిమితం అవుతోంది. నిధుల విషయంలో కేంద్రం ప్రతిసారి మొండిచేయి చూపిస్తూనే ఉంది. దీంతో ఇప్పుడు గులాబీ నేతలు గుస్సా అవుతున్నారు.

డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో ఎన్డీఏకు సహకరించిన కొంతసేపటికే టీఆర్‌ఎస్‌కు.. కేంద్రం షాకిచ్చింది. తెలంగాణలో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసింది. మరోవైపు ఢిఫెన్స్‌ ల్యాండ్స్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పడంలోనూ కాలాయాపన చేస్తూనే ఉంది. హస్తినలో కేంద్ర పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా.. త‌మ పూర్తి మ‌ద్దతు తెలుపుతున్నారు గులాబీ బాస్‌.. కానీ మోడీ మాత్రం రాష్ట్రానికి త‌గిన ప్రాధాన్యత ఇవ్వడం లేద‌ని ఆ ఎంపీలు డైరెక్టుగానే చెబుతున్నారు. కేంద్రం తీసుకున్న కీల‌క నిర్ణయాల‌కు తెలంగాణ ప్రభుత్వం అండ‌గా వుంటున్నా ప్రయోజ‌నం మాత్రం శూన్యమే అంటున్నారు. రాష్ట్రానికి యూనివ‌ర్సిటీలు కానీ, అభివృద్ది ప‌థకాలు ద‌క్కించుకోవ‌డంలోను, భారీ ప్రాజెక్టులు ర‌ప్పించుకోవ‌డంలోను టిఆరెస్ మైత్రి వ‌ర్క్ అవుట్ కావ‌డం లేదు. క‌నీసం ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం అఖిల ప‌క్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాల‌ని కోరి ఏడాది పూర్తి అయినా ఇంత వ‌ర‌కూ మోడీ అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదు. కేంద్రంతో ఎంత సఖ్యంగా ఉన్న నాలుగేళ్లలో ఒరిగింది ఏదీ లేదంటూ టీఆర్‌ఎస్‌ నేతలు మధనపడుతున్నారు..

దేశంలో నే తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందుతోందని మోడీ చెప్పడం తప్పా ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదంటున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టును సెంట్రల్ వాటర్ కమిషన్ సహితం మెచ్చుకున్నా.. 20వేల కోట్ల రూపాయల ఆర్థికసాయం కోరిన ప్రయోజనం లేదని. నీతి ఆయోగ్ మిషన్ భగీరథ కు 8 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసిన ఇప్పటి వరకు ఒక్క రూపాయి రాలేదని. డబుల్‌ బెడ్రూం స్కీమ్ కు సాయం లేదని. కొత్త సచివాలయం నిర్మాణానికి స్థలం కావాలని కోరిన పట్టించుకోవడం లేదని టి.ఆర్‌.ఎస్‌ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో ఎక్కడ ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రంపైనే బీజేపీ దృష్టి పెడుతోందని టి.ఆర్‌.ఎస్‌ ఎంపీలు అంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు త‌ప్పా మిగ‌తా రాష్ట్రాల‌ను మోడీ స‌ర్కారు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఎంపిలు విమ‌ర్శిస్తున్నారు. విభజన హామీలు సైతం అమలు అవ్వడం లేదని మండిపడుతున్నారు..

రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని భావించిన టి.ఆర్‌.ఎస్‌ ఎంపీలు.. మరోసారి ప్రధాని మోడీని కలిశారు. బైసన్‌పోలో రక్షణ భూముల అప్పగింత వ్యవహారంతో పాటు పలు పెండింగ్ అంశాలపై మోడీతో చర్చించారు. కర్ణాటకకు రక్షణ భూముల అప్పగింత వేగంగా జరిగినప్పుడు, తెలంగాణ విషయంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నించారు. ప్రధాని త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు..

ఏదీ ఏమైనా కేంద్రం తీరుపై గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు. అయితే ఇలా ప్రతి సారి కేంద్రం మోడిచేయి చూపిస్తున్నా.. టి.ఆర్‌.ఎస్‌ అన్ని అంశాల్లో మద్దతు ఇస్తుండడంతో స్థానికంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో ఇకపై కేంద్రంతో వైఖరి విషయంలో ఎలా ముందుకెళ్లాలని టి.ఆర్‌.ఎస్‌ నేతలు ఆలోచిస్తున్నారు..