అవిశ్వాసం నుంచి ఆత్మవిశ్వాసం వరకు…. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

parliament-session-from-no-confidence-motion-to-self-confidence

– ప్రదీప్ బోడపట్ల (ఢిల్లీ)

అవిశ్వాస తీర్మానంతో మొదలై … రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికవరకు ఆసక్తిగా సాగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడడంతో రాజకీయ ప్రత్యామ్నాయంగా మారేందుకు విపక్షాలు ఐక్యతను ప్రదర్శించడానికి ప్రయత్నించినా … అధికార ఎన్డీఏ మాత్రం రాజకీయ చతురతతో తటస్థ పార్టీలను తమవైపు తిప్పుకొని ఆధిక్యతను చాటుకుంది. జూలై 18న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల పమావేశాలు ముగిశాయి. 18 పనిదినాలపాటు సమావేశమైన సభ గత బడ్జెట్ సమావేశాలతో పోలిస్తే చాలా మెరుగ్గా జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంతోపాటు కావేరీ జలవివాదాల అంశంపై టీడీపీ, అన్నాడీఎంకేలు సభను అడ్డుకోవడంతో పూర్తిగా బడ్జెట్ సమావేశఆలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈసారి ఆ సమస్యను అధిగమించడం కోసం సమర్థ వ్యూహాన్ని అనుసరించింది. క్రితం సమావేశాల నుండి ప్రతీ రోజు విపక్షాలు ఇస్తున్న అవిశ్వాస తీర్మానాన్ని వర్షాకాల సమావేశాల మొదటిరోజునే అడ్మిట్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేసింది.

సమావేశాలు ప్రారంభమైన మూడో రోజునే అవిశ్వాస తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరపడం ద్వారా విపక్షాల అన్ని విమర్శలకు పార్లమెంటు సాక్షిగా ఒకేసారి సమాధానం ఇచ్చుకొనే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ కౌగిలి, కన్ను గీటిన సందర్భాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి. ఇదే సమయంలో ప్రతిపక్షాలను ఆటాడుకోవడంలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోని ప్రధాని నరేంద్ర మోడీ.. రాహుల్ చర్యలను తనకు మైలేజ్ వచ్చేలా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. విపక్షాల మూకదాడులు, అస్సాంలో భారత పౌరులను గుర్తించే ఎన్నార్సీ జాబితా విడుదల, బీహార్ ముజఫరాపూర్ మైనర్ బాలికలపై అత్యాచార ఘటనలు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పునకు ప్రభుత్వమే కారణమన్న ఆరోపణలు, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ళలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలవంటి అనేక అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశాయి విపక్షాలు. సార్వత్రిక ఎన్నికలు ఏడాదిలోగా జరగనుండడంతో ప్రతిపక్షాల ఐక్యతకు పార్లమెంట్ వేదికైంది. పలు కీలక అంశాలపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాల్లో స్పష్టమైన సమన్వయం కనిపించింది.

అయితే ప్రతిపక్షాల ఐక్యతారాగం ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంలో ఏమాత్రం సఫలం కాలేకపోయింది. లోక్ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూడింట రెండొంతుల తేడాతో వీగిపోవడంతోపాటు రాజ్యసభలో ప్రతిపక్షాలే బలంగా ఉన్నప్పటికీ ఉపసభాపతి ఎన్నికలో వాటి ఐక్యత విఫలమైంది. తటస్థ పార్టీలైన టీఆర్ఎస్, బీజేడీ, అన్నాడీఎంకే వంటి పార్టీలు ప్రతిపక్షాలకంటే ప్రభుత్వ కూటమివైపే మొగ్గు చూపడం… 2019 నాటికి ఏర్పడే కూటములపై ఆసక్తిని మరింత పెంచింది. అధికార ఎన్డీఏ మాత్రం అటు విపక్షాల రాజకీయ ఎత్తుగడలను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే లెజిస్లేటివ్ బిజినెస్ ను మాత్రం విజయవంతంగా పూర్తిచేసుకుంది.

బడ్జెట్ సమావేశాల్లో ఆటంకాల వల్ల ఆగిపోయిన అనేక బిల్లులు, ఆర్డినెన్సులను ఈ సమావేశాల్లో గట్టెక్కించగలిగింది. జాతీయ బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వ్యతిరేక చట్టాన్ని పటిష్టపరిచే బిల్లు, ఫ్యూజిటివ్ అఫెండర్స్ బిల్లు, జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం బిల్లు, ఎన్సీటీఈ బిల్లు, మోటర్ వెహికిల్స్ బిల్లు వంటి పలు కీలక బిల్లులను ఉభయసభల్లో ఆమోదింపచేసుకోవడంలో సఫలీకృతమైంది. ముస్లిం మహిళలను ఆకట్టుకొనేందుకు ట్రిపుల్ తలాక్ బిల్లును మాత్రం సమావేశాల చివరిరోజున రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకోవాలని భావించినప్పటికీ విపక్షాల అభ్యంతరాలతో చివరిక్షణంలో అధికారపార్టీ వెనక్కి తగ్గక తప్పలేదు. బడ్జెట్ సమావేశాల మాదిరిగానే వర్షాకాల సమావేశాల్లోనూ తెలుగు రాష్ట్రాల రాజకీయాంశాలే పార్లమెంటులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అన్ని విపక్షాలు అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చినప్పటికీ తెలుగుదేశం సభ్యుడు కేశినాని నాని నోటీసును స్పీకర్ పరిగణనలోకి తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం దేశవ్యాప్తంగా అన్ని పార్టీల దృష్టిని ఆకర్షించగలిగింది.

మోడీ లక్ష్యంగా టీడీపీ నేతల ప్రసంగాలు ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించడంతో ఆ పార్టీ సభ్యులు జయదేవ్, రామ్మోహన్ నాయుడు.. విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి అవిశ్వాస చర్చను సమర్థవంతంగా వినియోగించుకున్నారు. మరో తెలుగు రాష్ట్ర అధికారపార్టీ అయిన టీఆర్ఎస్ మాత్రం ఈ సమావేశాల సందర్భంగా అవిశ్వాస తీర్మానంలోనూ, రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికలోనూ అధికార పార్టీకి అండగా నిలవడం రాజకీయవర్గాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది. ఈ సహకారాన్ని అనుకూలంగా మరల్చుకుంటూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కలిసి హైకోర్టు విభజన, కొత్త జోన్ల ఏర్పాటు వంటి 11 అంశాలను సాధించుకొనే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మరో కీలక పార్టీ అయిన వైఎస్సార్సీపీ లోకసభ సభ్యులందరి రాజీనామాలూ ఆమోదం పొందడంతో ఈ సమావేశాల్లో వారి పాత్ర లేకుండా పోయింది.