ముగిసిన పార్లమెంట్‌ సమావేశాలు.. చట్టరూపం దాల్చని చారిత్రాత్మక బిల్లు

parliament-sessions-over-today

అధికార -విపక్షాల మధ్య మాటల యుద్ధాలతో వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ముగిసాయి. ముఖ్యంగా రాఫెల్ డీల్‌పై పార్లమెంటరీ కమిటీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. పార్లమెంట్‌ సమావేశాల ఆఖరి రోజు లోక్‌సభ, రాజ్యసభలోనూ ఇదే అంశంపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. దీంతో సభ ప్రారంభమైనప్పటి నుంచి రాఫెల్‌ అంశంతో లోక్‌సభ అట్టుడుకింది. విపక్ష నేతలు నిలబడి గట్టిగా నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళనల మధ్యే..ఆఖరి రోజు లోక్‌సభలో ఆర్బిట్రేషన్ బిల్లును ఆమోదించారు. ఆ తరువాత ఈ సమావేశాల్లో ఆమోదం పొందిన బిల్లులను స్పీకర్ సుమిత్రా మహాజన్ చదివి వినిపించారు. జీరో అవర్‌లో జరిగిన చర్చలను ఆమె గుర్తు చేశారు. గత సమావేశాల కంటే ఈసారి వర్షాకాల సమావేశాలు చాలా ఉపయుక్తంగా సాగాయని స్పీకర్ అన్నారు. తర్వాత ఆమె సభను నిరవధిక వాయిదా వేశారు..

ఇక రాజ్యసభను సైతం రాఫెల్‌ అంశం కుదిపేసింది. కొత్తగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ మొదట సభను నిర్వహించారు. అదే సమయంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆఖరి రోజు కాబట్టి సభకు సహకరించాలని ఆయన కోరినా.. విపక్ష సభ్యులు రాఫెల్‌ స్కాంపై చర్చ చేపట్టాలని.. పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశాయి. దీంతో సభ పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది.. తరువాత చైర్మన్‌ వెంకయ్య నాయుడు సభ నిర్వహించిన సమయంలోనూ అదే పరిస్థితి కనిపించింది. దీంతో సభ్యుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు..

ముస్లిం మహిళల కోసం తీసుకొచ్చిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు తాజా పార్లమెంట్‌ సమావేశాల్లోనూ చట్టరూపం దాల్చలేదు. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లుపై పలు సవరణ తరువాత రాజ్యసభలో ఆఖరి రోజు చర్చ జరపాలి అనుకున్నా.. సభలో చర్చకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. బిల్లు ప్రవేశ పెట్టడం లేదని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు..

మరోవైపు ఆఖరి రోజు సమావేశాల్లో సోనియా గాంధీ విపక్షాల ఆందోళనకు మద్దతుగా నిలిచారు. రాఫెల్‌ కుంభకోణంపై చర్చ చేపట్టాలని.. భారత దేశంలో ఇప్పటి వరకు ఇదే పెద్ద కుంభకోణం అంటూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వారి దగ్గరకు వచ్చిన సోనియా గాంధీ.. కేంద్రం తీరును తప్పు పడుతూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు..

ఆందోళన తరువాత పార్లమెంట్‌లో అడుగుపెడుతున్న సమయంలో అక్కడ కనిపించిన ఎంపీ శివ ప్రసాద్‌ను సోనియా పలకరించారు. తనను తాను పరిచయం చేసుకుంటుండగా.. మీ పోరాటం బాగుంది అంటూ సోనియా కితాబు ఇచ్చారు.. రోజుకో వేషధారణలతో నిరసన తెలిపిన ఎంపీ శివ ప్రసాద్‌ ఆఖరి రోజు ట్రాన్స్‌ జండెర్‌ వేషధారణలో వచ్చారు. మోడీ చేసిన అన్యాయాన్ని పాట రూపంలో అందరికీ వినిపించారు.

మరోవైపు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి ఏడాది అవ్వడంతో.. వెంకయ్యనాయుడు పార్లమెంట్ ఆవరణలో మొక్క నాటారు. పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపు ఇచ్చారు..

పార్లమెంట్ ఆఖరి రోజు సైతం టీడీపీ ఎంపీలు తమ పోరాటాన్ని వీడలేదు. ఏపీకి న్యాయం చేయాలని.. వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ సభ బయట ధర్నాకు దిగారు.. అవిశ్వాస తీర్మానం పెట్టడం ఒక చారిత్రాత్మకమని అన్నారు ఎంపీ సుజనాచౌదరి. అవిశ్వాసంతో సభలో ఉన్న వారందరికి ఏపీకి జరిగిన అన్యాయం తెలిసిందన్నారు. రాజ్యసభలో బీజేపీ నేతలు అసత్యలే మాట్లాడరన్న సుజనా..ఇప్పటివరకు ముగ్గురు రైల్వే మంత్రులు మారినా..రైల్వే జోన్ పై కథలు చెబుతున్నారని ఫైరయ్యారు.

ఏది ఏమైనా పార్లమెంట్‌ ఆఖరి రోజైనా సభ సజావుగా జరపాలని కేంద్రం చూసినా సాధ్యం కాలేదు. రాఫెల్‌ కుంభకోణంపై సమావేశాలను విపక్షాలు స్తంభింపజేశాయి.