పెళ్లిళ్లు కావట్లేదని ఆ ఊరి జనం..

ఎదిగివచ్చిన అమ్మాయి లేదా అబ్బాయిలకు పెళ్లిళ్లు కాకపోతే ఏమైందో అనుకుంటూ జాతకాలు చూపిస్తుంటారు. గుళ్లూ, గోపురాలు చుట్టేస్తుంటారు. మరి ఊరంతా తమ పిల్లలకు పెళ్లిళ్లు కావట్లేదని మనేది పడుతున్నారు. దానికి ఒక్కటే మార్గం అని ఆలోచించారు. అందుకోసం పోరాటమే చేశారు. చివరికి గెలిచి ఏకంగా ఊరి పేరునే మార్చేశారు. ఎవరైనా అనుకుంటారా ఊరిపేరు మారిస్తే పెళ్లిళ్లు అవుతాయని. కానీ ఆ ఊరి వాళ్లు అలానే ఆలోచించారు..

రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన ఓ గ్రామం పేరు మియాంకా బరా అని ముస్లిం పేరు ఉంది.. దాన్ని మహేశ్ నగర్‌గా మారిస్తే తమ బిడ్డల పెళ్లిళ్లు అవుతాయని భావించారు. ఇంతకీ పెళ్లిళ్లు కావట్లేదని బాధపడేది అమ్మాయిలు కాదండి.. అబ్బాయిలు.. ఈ ఊరి అబ్బాయిలకు అమ్మాయిని ఇవ్వడానికి చుట్టుపక్కల గ్రామాల వారు ఎవరూ ముందుకు రావట్లేదు. ప్రభుత్వానికి పలు మార్లు మొరపెట్టుకుంటే వారి విజ్ఞప్తిని స్వీకరించి ఎట్టకేలకు ఊరి పేరుని మార్చేశారు.

ఈ విషయంపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే హర్మీర్ సింగ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వం ఈ గ్రామాన్ని మహేశ్ నగర్ అని పిలిచేవారన్నారు. కాలక్రమంలో దాన్ని మియాంకా బరాగా మార్చారు. మళ్లీ ఇన్నాళ్లకు మొదటి పేరే ఆ ఊరికి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు ఊరి గ్రామస్తులతో పాటు ఆయన కూడా.