శ్రీవారి సన్నిధిలో పన్నెండేళ్లకోసారి మహాసంప్రోక్షణ.. రేపటినుంచే

tirumala-maha-samprokshanam

తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు శనివారం అంకురార్పణ జరుగనున్నది. ఈ సందర్భంగా రాత్రి ఏడుగంటల నుంచి తొమ్మిది గంటల వరకు విశ్వక్సేసుల ఊరేగింపు ఉంటుంది. ఆదివారం ఉదయం నుంచే మహా సంప్రోక్షణ కార్యక్రమం ఆగమోక్తంగా మొదలవుతుంది. ఈ వైదిక క్రతువులో భాగస్వాములయ్యేందుకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉద్దండులైన పండితులు తిరుమలకు చేరుకున్నారు.

శ్రీవారి సన్నిధిలో పన్నెండేళ్ల కోసారి మహా సంప్రోక్షణ జరుగుతుంది. ఈనెల 12 నుంచి 16 వరకు జరుగనున్న ఈ క్రతువు కోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఆలయం ముందు భాగంలో ఫ్యాబ్రిక్ క్లాత్ తయారు చేసిన శ్రీవారి భారీ ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణోత్సవ మండపంలోఇటుకలు, ఎర్రమట్టితో నిర్మించి, గోమయంతో అలికిన 28 హోమ గుండాలు, 21 హోమ వేదికలను సిద్ధం చేశారు. యజ్ఞయాగాదులకు ఆటంకం కలుగకుండా అక్కడ ఉన్న సీసీ కెమెరాలు, విద్యుత్ తీగలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ తొలగించారు.

మహా సంప్రోక్షణలో భాగంగా తొలి రోజు కుండలాలకు శుద్ధి పుణ్యాహవచనం చేస్తారు. యాగశాలలో అగ్ని ప్రతిష్ట చేసి హోమాలు నిర్వహిస్తారు. మూల విరాట్టులో ఉన్న శక్తిని కుంభంలోకి ఆవాహనం చేస్తారు. 13వ తేదీ సోమవారం అష్టబంధన వస్తువులకు, ద్రవ్యపదార్థాలకు శుద్ధి పుణ్యాహవచనం చేస్తారు.

ఐదు రోజుల పాటు జరిగే ఈ మహా క్రతువులో.. పద్నాలుగో తారీఖున గర్భాలయంలో మరమ్మతు పనులు చేపడుతారు. యాగశాలలో ప్రత్యేక హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమం ఉంటాయి. నాలుగో రోజైన పదిహేనో తేదీన 14 కలశాలతో మూలవర్లకు విశేషంగా మహాశాంతి తిరుమంజసం నిర్వహిస్తారు. చివరి రోజున మహా పూర్ణహుతి నిర్వహణ ఉంటుంది. గర్భాలయంతో పాటు ఉప ఆలయాలకు కుంభాలను తరలిస్తారు. అనంతరం కుంభం నుంచి మూలవిరాట్టుకు స్వామివారి శక్తి ఆవాహనం చేస్తారు. బ్రహ్మగోష పఠనంతో మహా సంప్రోక్షణ ముగుస్తుంది. 17వ తేదీ నుంచి యథావిధిగా శ్రీవారి దర్శనభాగ్యం ఉంటుంది.

మహా సంప్రోక్షణను పురస్కరించుకుని శ్రీవారి దర్శనం విషయంలో ఆంక్షలు అమలు కానున్నాయి. మహా సంప్రోక్షణ సమయంలో రోజుకు కేవలం 18 నుంచి 30 వేల మందికి మాత్రమే స్వామివారి దర్శనభాగ్యం లభించనుంది. గురువారం అర్ధరాత్రి నుంచే దర్శనం టోకెన్ల మంజూరును నిలిపివేసింది టీటీడీ. అంకరార్పణ రోజున కేవలం యాభైవేల మందిని మాత్రమే స్వామి దర్శనానికి అనుమతిస్తారు. సంప్రోక్షణ జరిగే రోజుల్లో ఎలాంటి ఆర్జిత సేవలు సహాఇతర దర్శనాలకు సంబంధించిన టోకెన్ల జారీ ఉండదు. మహాసంప్రోక్షణ సమయంలో దర్శనం ఉండదని కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారంతో.. ఇప్పటికే తిరుమలకు భక్తుల తాకిడి తగ్గిపోయింది.