ట్రిపుల్ తలాక్ బిల్లుకు కీలక సవరణలు…

triple talaq

నేడు రాజ్యసభలో చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకోనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లు పలు సవరణలతో రాజ్యసభ ముందుకు రానుంది. అటు ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై కేంద్ర కేబినెట్‌ కీలక మార్పులు చేసింది. భార్య వాదన విన్న తరువాత.. భర్తకు కోర్టు బెయిల్ ఇచ్చే అధికారాన్ని కట్టబెడుతూ మార్పులు చేసింది. సర్వత్రా వ్యక్తమౌతున్న విమర్శలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఈ సవరణలు చేసింది.

ట్రిపుల్ తలాక్ చట్టం దుర్వినియోగం కాకుండా.. భర్తకు బెయిల్ పొందే అవకాశం కల్పించడం సహా బిల్లులో కేంద్రం పలు మార్పులు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు బిల్లులో మార్పులకు ఆమోదం తెలిపింది.

కేంద్రం తాజాగా చేసిన సవరణల ప్రకారం తలాక్ చెప్పిన భర్తలపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయవచ్చు. అతడు కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందవచ్చు. ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా భార్యలకు విడాకులు ఇచ్చిన కేసులో దోషులైన పురుషులకు మేజిస్ర్టేట్‌ బెయిల్‌ మంజూరు చేయవచ్చనే నిబంధనను బిల్లులో చేర్చింది కేంద్ర క్యాబినెట్‌. ట్రిపుల్‌ తలాక్‌తో విడాకులు ఇవ్వడం చట్టవిరుద్ధమైన నేరంగా పరిగణిస్తూ భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. తాజా సవరణ ప్రకారం మేజిస్ట్రేట్‌కు బెయిల్‌ మంజూరు చేసే అధికారాలుంటాయి. ఈ చట్టం ద్వారా బాధితురాలు తనకు, మైనర్‌ పిల్లలకు పరిహారం కోరుతూ మేజిస్ర్టేట్‌ను ఆశ్రయించవచ్చు. మేజిస్ట్రేట్‌ నిర్ణయానుసారం మైనర్‌ పిల్లలను తన ఆధీనంలోకి తీసుకునే వెసులుబాటు ఉంది.

భర్తకు బెయిల్ పొందే నిబంధన ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఆమేరకు కేంద్రం బిల్లులో మార్పులు చేసింది. అయితే.. ఎవరికి ఒత్తిడికి తలొగ్గి బిల్లులో మార్పులు చేయలేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ.. ముస్లిం మహిళల హక్కుల రక్షణ పేరుతో కేంద్రం తెచ్చిన బిల్లును లోక్‌సభ ఆమోదించినప్పటికీ.. రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో కీలక మార్పులకు కేబినెట్ ఆమోద్ర వేసింది. ఇవాళ రాజ్యసభ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లుకు వచ్చే అవకాశం ఉంది. కీలక సవరణల నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందుతుందనే ధీమా వ్యక్తం చేస్తోంది మోడీ సర్కార్.