84ఏళ్ల వయసులో తుపాకీ గురి పెట్టి..

చేసేపని మంచిదైతే నలుగురూ చేయూతనందిస్తారు.. ముందు ఆ పని నీకు నచ్చాలి.. ఆ తరువాత నలుగురూ మెచ్చాలి.. నేర్చుకోవాలన్న తపన ఉండాలే కానీ వయసుతో పనేముంది.. ఈవయసులో నీకివన్నీ అవసరమా.. అయినా అది మగవాళ్లు మాత్రమే చేసే పని అన్న వారికి షూటింగ్‌తోనే సమాధానం చెప్పింది 84 ఏళ్ల చంద్ర తోమార్. ఉత్తర ప్రదేశ్‌లోని ఓ చిన్న గ్రామంలో నివసించే చంద్ర తుపాకీని చేతబట్టింది.

తుపాకీని గురిపెట్టి, ట్రిగ్గర్ నొక్కి ఎవరినో చంపేయాలని కాదు. గ్రామంలో యువకులు నేర్చుకుంటుంటే తనకీ నేర్చుకోవాలనిపించింది. వారందరికంటే త్వరగా నేర్చేసుకుని గురువుగారి మనసులో స్థానం సంపాదించింది. బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంది. తనతో పాటు నేర్చుకున్న యువకులు కూడా తనతో పోటీ పడే స్థాయికి ఎదిగింది. గురితప్పకుండా లక్ష్యాన్ని చేధిస్తూ అవార్డులు, రివార్డులతో పాటు మరెన్నో పతకాలు సాధించింది.


గ్రామాల్లో ఇప్పటికీ చాలా కుటుంబాల్లోని యువతీ యువకులు ఆశలు ఉన్నా అవకాశాలు లేక నాలుగ్గోడల మధ్యే గ్గిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు వివక్షకు గురవుతున్నారు. తానేమీ చదువుకోకపోయినా ఇలాంటి అరాచకాల్ని నిరసించే చంద్ర ఆడపిల్లల స్వీయరక్షణకు షూటింగ్ నేర్చుకోవడం చాలా అవసరమని భావించి తనకి వచ్చిన విద్యను నలుగురికీ పంచాలని ఉచితంగా వారికి శిక్షణ ఇస్తోంది.

ఇంటింటికీ వెళ్లి షూటింగ్ నేర్చుకోవడం వలన ఉపయోగాలు చెబుతూ తల్లిదండ్రులకు వివరిస్తోంది. పిల్లల్లో షూటింగ్ నేర్చుకోవడం పట్ల ఉత్సాహం కలిగిస్తోంది. వారు కూడా 84 ఏళ్ల బామ్మ చేయగాలేంది మేమెందుకు చేయలేమంటూ షూటింగ్ నేర్చుకోవడం పట్ల ఉత్సాహం చూపిస్తున్నారు.