కుప్పకూలిన ప్లైఓవర్.. తప్పిన భారీ ప్రాణనష్టం

flyover, collapse

ఉత్తరప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌ తెల్లవారుజామున కుప్పకూలింది. బస్తీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో కొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో వారం రోజులుగా వర్షం పడుతుండటంతో ఫ్లైఓవర్‌కు సపోర్ట్‌గా ఉంచిన బీమ్‌లు భూమిలోకి దిగబడిపోయాయి. తెల్లవారుజామున కావడంతో ఆ ప్రాంతంలో జన సంచారం లేదు. దీంతో.. భారీ ప్రాణనష్టం తప్పినట్టయింది.

28వ నెంబర్ జాతీయ రహదారిపై లక్నోకు 205 కిలోమీటర్ల దూరంలో ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టారు. వారం రోజుల వర్షానికే బీమ్‌లు కుంగిపోతే.. ఒకవేళ ఫ్లైఓవర్‌ పూర్తయినప్పుడు కుండపోత కురిసి ఉంటే.. ఏ స్థాయి దుర్ఘటన చోటు చేసుకునేదోనని స్థానికులు భయపడిపోతున్నారు. ప్రమాదపు సమాచారాన్ని తెలుసుకున్న సీఎం యోగి ఆదిత్యానాథ్‌ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.