రెడ్ అలర్ట్.. కుండపోత వాన.. కట్టలు తెంచుకున్నవరద..

rains in kerala

కుండపోత వాన.. కట్టలు తెంచుకున్న వరదతో కేరళ చిన్నాభిన్నమైంది. గ్రామాలను వర్షం నీరు ముంచెత్తడంతో.. జనజీవనం స్తంభించింది. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడగా.. మరికొన్ని చోట్ల ఇళ్లు కూలి 30మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 24 డ్యాముల గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. సైన్యం, నౌకాదళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టగా.. మరో 36గంటలు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

భారీ వర్షాలు, వరదలతో కేరళలో జనజీవనం అస్తవ్యస్థమైంది. బుధవారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో కేరళ వ్యాప్తంగా నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో మునుపెన్నడూ లేని విధంగా 24 ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది.

నీటి మట్టం ప్రమాదకర స్థాయికి పెరగడంతో.. ఆసియాలోనే అతి పెద్దదైన ఇడుక్కి రిజర్వాయర్ గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. ప్రాజెక్ట్ నుంచి దిగువకు విడుదల చేసే నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండటంతో.. దిగువున ఉన్న ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరదల ఉధృతికి కొన్ని చోట్ల రహదారులు కొట్టుకుపోగా.. చాలా చోట్ల కొండ చరియలు విరిగి పడి రవాణా వ్యవస్థ స్తంభించింది. వరదల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 50వేల మందికి పైగా నిరాశ్రయలయ్యారు. వందల గ్రామాలు వరద నీటిలో నానుతున్నాయి.

ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో వర్షాలు, వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. పెరియార్‌ నదిలో నీటిమట్టం ప్రమాదకరంగా పెరుగుతోంది. పరిస్థితి చేయి దాటు తుండటంతో.. ఇడుక్కి, కోజికోడ్, మలపురం, జిల్లాలలో జాతీయ విపత్తు నివారణా దళం, నౌకా, సైనిక దళాలకు చెందిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎనిమిది సైనిక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న 16వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇడుక్కి ప్రాంతంలో రెండు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. మరికొన్ని బృందాలు రానున్నాయి. అటు భారీ వర్షాలతో కొచ్చి విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి.

కొండ ప్రాంతాల్లోకి పర్యాటకులు వెళ్లకుండా ఇడుక్కి జిల్లా యంత్రాంగం నిషేదాజ్ఞలు జారీ చేసింది. వరదల కారణంగా దాదాపు 57 మంది పర్యాటకులు మున్నార్‌ ప్రాంతంలో చిక్కుకున్నట్లు తెలిపింది. వారిలో ఇద్దరు అమెరికా, ఏడుగురు సింగపూర్‌, ఐదుగురు ఒమన్‌, ఏడుగురు సౌదీ అరేబియా, ముగ్గురు రష్యన్‌ పర్యాటకులు ఉన్నట్లు ప్రకటించింది. అటు కేరళలో వెదర్ ఎమర్జెన్సీ నేపథ్యంలో పర్యాటకులు కేరళకు వెళ్లొద్దని అమెరికా మార్గదర్శకాలు జారీ చేసింది. భారీ వరదల కారణంగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, అమెరికా పౌరులు పర్యటక ప్రాంతమైన కేరళకు కొన్ని రోజులు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది.

కేరళలో వాతవరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో.. వరద పరిస్థితిపై సమీక్షించిన కేరళ సీఎం పినరయి విజయన్ సమీక్ష నిర్వహించారు. ఈనెల 13వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద పరిస్థితులపై సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం కేరళ వెళ్లనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు.