భగభగమండే సూర్యుడి సంగతేంటో చూస్తా.. : నాసా

parker solar probe,

భగభగమండే సూర్యుడి సంగతేంటో చూస్తామంటోంది అమెరికా అంతరిక్ష సంస్థ. అగ్నిగోళాన్ని తలపించే సూర్యుడికి అత్యంత చేరువలోకి వెళ్లేందుకు ఒక వ్యోమనౌకను సిద్ధం చేసింది. ప్రపంచ భాస్కరుడికి సంబంధించి అంతుచిక్కని అనేక ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నంలో.. ఈ నౌకను పంపించేందుకు నేడే ముహూర్తం పెట్టింది.

కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే సూర్యుడి వేడిని తట్టుకోలేక పోతున్నాం. అలాంటిది, సూర్యుడికి వెళ్లడమనేది సాధ్యమయ్యే పనేనా? అసాధ్యమనుకున్న ఆ కార్యాన్ని సుసాధ్యం చేసేందుకే ఈ సాహస యాత్ర చేపట్టింటి నాసా. సూర్యడికి అత్యంత చేరువలోకి ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’ అనే రోబోటిక్‌ వ్యోమనౌకను పంపుతోంది. దాదాపు 30 లక్షల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో అట్టుడికిపోయే సూర్యుడి బాహ్య వాతావరణ వలయమైన కరోనాలోకి ఈ వ్యోమ నౌకను పంపుతోంది. దీంతో దశాబ్దాల నాటి శాస్త్రవేత్తల కల నెరవేరబోతోంది. సూర్యుడి గురించి ఇది విప్పబోయే గుట్టుమట్ల ద్వారా సౌరతుపాన్లు వంటి విపరీత పరిణామాల బారి నుంచి మన విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, ఉపగ్రహాలు, వ్యోమగాములను భద్రంగా రక్షించుకోవచ్చు.

భానుడికెందుకంత భగభగ. అయస్కాంత శక్తితో కల్లోలంగా ఉండే సూర్యుడు.. ఎందుకలా ఒక్కోసారి ప్రచండ శక్తితో విరుచుకుపడుతాడు. సౌరతుఫానులు ఎందకు ఏర్పడుతాయి. అసలు వీటన్నింటికీ ప్రధాన కారణం సూర్యుడి చుట్టూ ఆవరించి ఉండే బాహ్యవాతావరణం. దీన్నే కరోనా అంటారు. ఈ కరోనా గురించి అర్థం చేసుకోనేందుకే ఈ రోబోటిక్‌ వ్యోమ నౌకను పంపతున్నారు నాసా పరిశోధకులు.

ఖగోళ శాస్త్రవేత్తల అరవై ఏళ్ల కళ ఇది. సూర్యుడిని చుట్టిరావాలన్న లక్ష్యంతో ఏళ్లతరబడి పరిశోధనలు చేస్తున్న నాసా అంతరిక్ష శాస్త్రవేత్తలు.. పార్కర్‌ ప్రోబ్‌ తరహా వ్యోమనౌకను నిర్మించారు. ఇప్పటి వరకూ సూర్యుడి జోలికి వెళ్లని ఈ రోదసీ సంస్థ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో తన కలను సాకారం చేసుకోబోతోంది. చిన్న కారు పరిమాణంలో ఉంటే రోబోటిక్‌ నౌకను సూర్యుడి చెంతకు పంపిస్తోంది.

parker solar probe,

భూమ్మీద నుంచి సూర్యుణ్ని డైరెక్టుగా చూడాలంటేనే కళ్లు మంటలు పుడుతాయి. అలాంటి సూర్యుడికి దగ్గరగా వెళితే మాడి మసై పోవడం ఖాయం. కానీ, ఈ పార్కర్‌ ప్రోబ్‌కు అలాంటి సమస్య లేదు. అక్కడి వేడిమిని తట్టుకునేందుకు దాని చుట్టూ ప్రత్యేక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు శాస్త్రవేత్తలు. సూర్యుడికి చేరువగా వెళ్లినప్పుడు.. ఈ ఉష్ణ కవచం సూర్యుడి వైపునకు మరలుతుంది. సూర్యతాపాన్ని మొత్తం అదే ఎదుర్కుంటుంది.