ఖాళీగా ఉందికదా అని.. విమానాన్ని ఆకాశంలోకి పోనిచ్చాడు.. చివరకు..

Passenger Plane Stolen by Employee Crashes on Island Near Seattle Airport

ఇప్పటి వరకు మీరు నగల దొంగనో, బైకు దొంగనో, కారు దొంగనో చూసుంటారు. విమానం దొంగను ఎప్పుడైనా చూశారా?? ఎవరూ లేకుండా ఖాళీగా ఉందికదా అని.. విమానాన్ని ఆకాశంలోకి పోనిచ్చాడు. గాల్లోకి ఎగిరిన తర్వాత అతనికి ఎలా కంట్రోల్‌ చేయాలో తెలియకపోవడంతో.. పక్కనున్న దీవిలో విమానం కుప్పకూలింది. ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్‌లో శుక్రవారం సాయంత్రం జరిగింది.

ఒక విమానం గాల్లోకి ఎగరాలంటే సవాలక్ష తతంగాలు ఉంటాయి. సంబంధిత అథారిటీ నుంచి అన్ని రకాల అనుమతులు వచ్చాకే విమానం రన్‌వే మీదకు వెళ్తుంది. కానీ, ఎలాంటి ఆదేశాలు, సూచనలు లేకుండా విమానం గాల్లోకి ఎగరడం వాషింగ్టన్‌లోని ఎయిర్‌పోర్టు అధికారులను విస్మయానికి గురిచేసింది. అంతేనా! ఇదేమైనా ఉగ్రవాద చర్య అయ్యుండొచ్చని ఆందోళన చెందారు. వెంటనే జెట్‌ విమానాలతో వెంబడించారు. అది ఉగ్రవాద చర్య కాదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

అసలు విషయం ఏమిటంటే.. అలస్కా ఎయిర్‌లైన్స్‌ చెందిన ఒక మెకానిక్‌ చేసిన ఘనకార్యం ఇది. విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి.. ఉన్నట్టుండి విమానాన్ని ఎత్తుకెళ్లి షికార్లు కొట్టాడు. రయ్యుమని గాల్లోకైతే తోలుకెళ్లాడుగాని, ఆపై దాన్ని కంట్రోల్‌చేయలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోయింది. 76 సీటింగ్‌ కెపాసిటీ కలిగిన ఈ విమానంలో అతను తప్ప ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

విమనాన్ని కొంతదూరం తీసుకెళ్లగలిగిన మోకానిక్‌.. ఆ తరువాత కంట్రోల్‌ చేయలేకపోవడంతో వాషింగ్టన్‌ ప్రాంతంలో క్రాష్‌ చేశాడని పోలీసుల అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదని ఎయిర్‌ లైన్స్‌ అధికారులు ప్రకటించారు. ఆత్మహత్య చేసుకునేందుకు అతను ఇలా చేసి ఉంటాడనే కోణంలోనూ విచారిస్తున్నారు. విమానం కుప్పకూలినా.. దాన్ని తీసుకెళ్లిన మెకానిక్‌ మాత్రం గాయాలతో బయటపడడం విశేషం. ఈ విమానం గాలిలో చక్కర్లు కొడుతూ.. క్రాష్‌ అయిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -