డాక్టర్ శిల్ప సూసైడ్ కేసులో మరో మలుపు

డాక్టర్ శిల్ప సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట ప్రొఫెసర్ల వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమన్న ఆరోపణలు రాగా.. ఇప్పుడు ఆమె వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్య చేసుకుందనే వాదన వినిపిస్తోంది. ఇంతకీ ప్రొఫెసర్లపై జూడాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత? శిల్ప ఆత్మహత్యకు తామెలా బాధ్యులమవుతామంటున్న ప్రొఫెసర్ల వాదనలో నిజమెంత? శిల్ప కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఏం తెల్చబోతుంది?

డాక్టర్ శిల్ప సూసైడ్ ఎపిసోడ్.. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీని కుదిపేస్తోంది. ఓ వైపు జూనియర్ డాక్టర్లు.. మరోవైపు ప్రొఫెసర్ల పోటా పోటీ ఆందోళనలతో యూనివర్శిటీ అట్టుడుకుతోంది. శిల్పమృతికి ప్రొఫెసర్ల వేధింపులే కారణమని మెడికోలు ఆరోపిస్తుంటే.. ఒత్తిడితో చనిపోతే.. తమపై నిందలెందుకు మోపుతున్నారంటూ.. జూడాలపై ప్రొఫెసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శిల్ప ఆత్మహత్య కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ ఎస్పీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం వాస్తవాలను వెలికి తీసే పనిలో ఉంది. విద్యార్ధులతో పాటు కళాశాల సిబ్బందిని ప్రశ్నించింది. అటు హైలెవల్ కమిటీ కూడా నిజనిర్ధారణ చేస్తోంది. విద్యార్ధులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంతా అనే దానిపై దర్యాప్తు చేస్తోంది.

శిల్ప ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని మెడికోలు డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనలు చేశారు. శిల్ప మృతికి కారకులైన హెచ్‌ఓడీ, మరో ఇద్దరు ప్రోఫెసర్లపై నిర్భయ కేసులు నమోదు చేయాలని నినదించారు. అటు శిల్ప మృతి కేసులో.. సమగ్ర దర్యాప్తు జరిపి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

మెడికోల ఆరోపణలను ప్రొఫెసర్లు, సీనియర్ డాక్టర్లు తప్పుపట్టారు. శిల్ప ఆత్మహత్యకు తామెలా బాధ్యులమవుతామని ప్రశ్నించారు. ప్రొఫెసర్లు, వైద్యులపై జూడాలు ఆరోపణలు చేయడంతో.. ఎస్వీ మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్‌ అత్యవసరంగా సమావేశం అయ్యింది. ఒత్తిడితో శిల్ప సూసైడ్ చేసుకుంటే.. తమపై నిందలెందుకు వేస్తున్నారని వైద్యులు ప్రశ్నించారు. వ్యక్తిగత సమస్యలతో చనిపోతే తమను బాధ్యుల్ని చేయడం దారుణమన్నారు. ప్రిన్సిపల్ రమణయ్యను బదిలీ చేయడంపైనా డాక్టర్లు నిరసన తెలిపారు. ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డాక్టర్లు, మెడికోల పంతంతో ఎస్వీ మెడికల్ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండటంతో.. అటు సీఐడి కానీ.. ఇటు హైలెవల్ కమిటీ కానీ ఏం తేల్చబోతున్నాయనేది ఆసక్తి కరంగా మారింది.