ఊహించిందే నిజమైంది.. దుర్గమ్మ చీర చోరీ చేసింది ఆమే..

durga temple, durga saree

అందరూ ఊహించిందే నిజమైంది. దుర్గమ్మ చీర చోరీ చేసింది పాలకమండలి సభ్యురాలేనని రుజువైంది. దీంతో.. పాలకమండలి నుంచి ఆమెకు ఉద్వాసన పలికింది ప్రభుత్వం. అలాగే అమ్మవారి చీర మాయం కావడం.. ఆ సమయంలో సీసీ ఫుటేజీ లేక పోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మొత్తం వ్యవహారంలో ఆలయ అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లం కావడంతో ప్రభుత్వం ఈవో పై బదిలీ వేటు వేసింది.

బెజవాడ దుర్గమ్మ ఆలయాన్ని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొన్న గర్భాలయంలో క్షుద్రపూజలు కలకలం రేపితే.. తాజాగా అమ్మవారికి భక్తులు సమర్పించిన చీర మాయం కావడం దుమారం రేపుతోంది. చీర కనిపించకుండా పోయి రోజులు గడుస్తున్నా ఆలయ పాలక మండలి మీన మేషాలు లెక్కించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. సీఎం చంద్రబాబే జోక్యం చేసుకుని తీవ్రంగా మందలించాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు పోలీసుల విచారణలో పాలకమండలి సభ్యురాలు సూర్యలతే దొంగతనం చేసినట్లు తేలింది. దీంతో పాలకమండలి నుంచి సూర్యలతను తప్పించిన ప్రభుత్వం.. దుర్గగుడి ఈవో పద్మను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఈవోగా ఐ.ఆర్.ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మ నియమించింది.

ఉండవల్లికి చెందిన పద్మజ అనే భక్తురాలు 18వేల రూపాయల విలువైన చీరను అమ్మవారికి ప్రత్యేకంగా నేయించి కానుకగా సమర్పించారు. ఆగస్టు 5న మహామండపం ఆరో అంతస్థులో అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఉంచిన చీర కాసేపటికే మాయమైంది. భక్తురాలి ఫిర్యాదు మేరకు పాలకమండలి సభ్యులు విచారణ చేపట్టగా.. కోడెల సూర్యలత తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం, సూర్యలతపై చర్యలకు పాలకమండలి మీనమేషాలు లెక్కించడంతో సీఎం చంద్రబాబే కలగజేసుకోవాల్సి వచ్చింది. సీఎం సీరియస్ కావడంతో సూర్యలతను పాలక మండలి సభ్యురాలి పదవి నుంచి ఆమెను తొలగిస్తూ దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక జీవో విడుదల చేశారు.

చీర చోరీకి గురవడంపై విచారణ జరిపించాలని భక్తురాలు ఆలయ ఈవో పద్మ, పాలకమండలి ఛైర్మన్ గౌరంగబాబుకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టిన ఈవో ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. చీరల విభాగానికి చెందిన నాగమణి నుంచి సూర్యలత చీర తీసుకెళ్లినట్లు తేలడంతో.. 1987 ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 28 ప్రకారం ఆమెను పాలకమండలి నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

పాలకమండలి నుంచి సూర్యలతను తప్పించిన అనంతరం.. దుర్గగుడి ఈవో పద్మను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో IRS అధికారి కోటేశ్వరమ్మను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దుర్గగుడి ఈవో స్థానం నుంచి పద్మను తప్పించిన ప్రభుత్వం.. ఆమెను ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించడంతో పాటు.. ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.