రూ.25లక్షలకు స్కెచ్ గీస్తే.. అదృష్టం..

అన్ని కళల్లోకి చోర కళ అత్యంత కష్టమైంది. దానికి చాలా నేర్పు, ప్రావిణ్యం కావాలి. దొంగతనం చేస్తూ దొరక్కపోతే దొరే. దొరికారో ఇక మీ పని గోవిందా. లాఠీలతో కుళ్ళబొడిచి, జైల్లో ఊచలు లెక్కబెట్టిస్తారు పోలీసులు. కష్టపడకుండా రూ.100లు వస్తున్నాయంటేనే ఆనందం. మరి అలాంటిది పాతిక లక్షలు దొరికితే లైఫ్ సెటిల్ అయిపోతుందని భారీ స్కెచ్ వేశారు. అందుకోసం పది రోజుల ముందు నించి రెక్కీ కూడా నిర్వహించారు. కానీ పాపం అది కాస్తా అట్టర్ ప్లాపయింది. అడ్డంగా దొరికిపోయారు ఆ నలుగురు. ఢిల్లీకి చెందిన 43 ఏళ్ల ఓ వ్యక్తికి దుస్తులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. అక్కడికి రెగ్యులర్‌గా ఖలీద్ అనే వ్యక్తి దుస్తులు కొనుగోలు చేయడానికి వస్తుండేవాడు.

ఈ క్రమంలోనే వ్యాపారి వద్ద భారీ మొత్తంలో నోట్ల కట్టలు ఉండడాన్ని గమనించేవాడు. వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో రోజూ ఓ బ్యాగు తీసుకుని వెళ్లడాన్ని కూడా ఖలీద్ చూసేవాడు. ఇలా వచ్చినప్పుడల్లా వ్యాపారి చేతిలోని బ్యాగుని చూసేసరికి దురాలోచన పుట్టింది. నలుగురు వ్యక్తులతో కలిసి బ్యాగు కొట్టేయాలని పథకం వేశారు. మంచి ముహూర్తం చూసుకుని రంగంలోకి దిగారు. వ్యాపారి బైక్‌పై ఇంటికి వెళ్లే సమయంలో దారి కాచి అడ్డగించారు. కళ్లల్లో కారం కొట్టి బ్యాగ్ లాక్కున్నారు. కష్టపడి దోచుకున్న సొమ్ముని నలుగురూ పంచుకుందామని ఇంటికి వెళ్లి బ్యాగు తెరిచి చూసారు. అంతే ఒక్కసారిగా మిత్రులంతా నీరుగారి పోయారు. అందులో పాతిక లక్షలు కాదు గదా పాతిక రూపాయలు కూడా లేవు. బ్యాగ్ మొత్తం వెతికితే రూ.5 నాణెం కనిపించింది. ఏవో ముఖ్యమైన పత్రాలు మాత్రం ఉన్నాయి. పోనీ బైక్ డిక్కీలో ఏమైనా దొరుకుతాయేమోనని చూస్తే అక్కడ కూడా నిరాశే ఎదురయ్యింది. ఈలోపు వ్యాపారి పోలీసులకు కబురందించాడు. వారు రంగంలోకి దిగి సీసీటీవి ఫుటేజి పరిశీలించగా రోజూ వచ్చే వ్యక్తే చోరీకి పాల్పడ్డాడని తెలుసుకున్నారు. నలుగురిలో ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చోరీ జరిగిన రోజు వ్యాపారి డబ్బులు బ్యాగులో పెట్టకుండా తన జేబులో 10 వేల రూపాయల నగదు ఉంచుకోవడం కొసమెరుపు.