ఓ పెళ్లికి అక్షింతలు.. మరో పెళ్లికి పెదవి విరుపులు..

– కుమార్ శ్రీరామనేని

వారం తేడాలో రెండు పెళ్ళి కథలు తెరమీదకు వచ్చాయి. అందులో ఒకటి విమర్శకుల ప్రశంసలు అందుకుంటే.. మరొకటి సంప్రదాయాలను ఇష్టపడే వారిని కూడా మెప్పించలేకపోయింది. మరి మెప్పించిన పెళ్ళి కథలో ఏముంది..? పెదవి విరుపులను అందుకున్న పెళ్ళిలో ఏం లోపించింది? ఒక కథలో ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం ప్రేక్షకుల మనసును గెలిస్తే మరో కథలో ఆ నమ్మకాలు ఊసే లేని సంప్రదాయాల హోరు ప్రేక్షకులకు విసుగు తెప్పించింది.

చి ల సౌ.. ఈ మూవీ కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. సుశాంత్ సినిమా ఏం చూస్తాం అనుకునే ప్రేక్షకుల్ని కూడా ఈ కథ మెప్పించింది. ఈ కథనం ఎంగేజ్ చేసింది. అంజలి పాత్రను దర్శకుడు మలచిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇందులో సంప్రదాయాల ఊసులేదు. ముహుర్తాల పట్టింపులు లేవు. కేవలం ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి ఇద్దరినీ తీసుకొచ్చిన దర్శకుడి కథనం తప్ప. అందుకే చాలా సింపుల్ గా జరిగిన ఈ పెళ్లికి ప్రేక్షకులు అక్షింతలు వేస్తున్నారు.

 శ్రీనివాసుడి కళ్యాణంలో పెళ్ళి మీద పెట్టిన శ్రద్ద, వీరి ప్రేమ మీద పెట్టలేదు. అబ్బాయి మంచోడని ప్రతి సన్నివేశంలో ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు వీరి బంధాన్ని ఎలివేట్ చేసేందుకు ఏ సన్నివేశాన్ని సృష్టించలేకపోయాడు. అందుకే పెళ్ళి సంప్రదాయాలు ఎలివేట్ అయ్యాయి కానీ వీరి ప్రేమకాదు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ని మార్చేందుకు హీరో చేసే ప్రయత్నాలు కూడా పెద్దగా రక్తి కట్టించలేకపోయాయి. అందుకే ఈ పెళ్ళి లో ఆకర్షణ ఉంది కానీ బంధాలు పెద్దగా ఫీల్ ని కలిగించలేకపోయాయి.

తనను వద్దు అన్న అబ్బాయిని.. తనేమీ మారకుండానే తన వాడిని చేసుకున్న అంజలి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. నిజమే ప్రతి ఇంట్లో అంజలి లాంటి అమ్మాయి ఉంటే బావుంటుంది అనేంతగా ఆ పాత్ర ఇంప్రెస్ చేసింది. అర్జున్ పాత్రలో మంచితనం కనిపించింది కానీ డైలాగ్స్ లో వినిపించలేదు. ఆడియన్స్ ఫీల్ అయ్యే విధంగా దర్శకుడు కథను నడిపించాడు. తనను వద్దంటున్న అమ్మాయి కోసం తనకు ఉన్నదంతా ఇచ్చేంత ప్రేమను సన్నివేశంలో చూపించాడు. అందుకే చి లా సౌ లో కనిపించిన ప్రేమ కనెక్ట్ అయ్యింది.

సంప్రదాయాలను గౌరవించాలి. ఆచారాలను పాటించాలి. వీటితో పాటు మనుషుల మధ్య సంబంధాల బలం తెలిపే సన్నివేశాలుండాలి. మాటలు పొదుపుగా వాడితే ఎక్కువమంది వింటారు. శ్రీనివాసుడి కళ్యాణం లో ఇదే మిస్ అయ్యింది. పెళ్ళి గురించి చెప్పేందుకు పెట్టిన శ్రద్దను పెళ్ళి చేసుకునే వారి ప్రేమ మీద పెట్టలేదు. అందరినీ ఎదుటివారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే శ్రీనివాసుడు.. ప్రాణంగా ప్రేమించిన మరదలిని మాత్రం పట్టించుకోలేదు. పెళ్ళి విలువ తెలియక భర్తను వద్దనుకున్న ఒక అమ్మాయి కళ్ళముందే కనబడుతున్నా.. వాళ్లను సరిదిద్దలేదు. అందుకే సంప్రదాయాలకు చేసిన పెళ్ళి మనుషులకు కనెక్ట్ అవలేదు.