శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ క్రతువు ప్రారంభం

mahasamproksham updates in tirumala

తిరుమల శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ క్రతువు ఆగమోక్తంగా ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకు ఆలయంలో హోమగుండాలు వెలిగించారు. పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం నిర్వహిస్తున్నారు. ఈ మహాసంప్రోక్షణ జరిగినన్ని రోజులు రుత్వికులు రక్షాబంధనం ధరిస్తారు. ఇందుకోసం టీటీడీ 2 గ్రాముల బరువైన బంగారు రక్షాబంధనాలు చేయించింది. ప్రధానాచార్యుడు, రుత్వికులు, వైఖానస పరిచారకులు యాగశాలలో ఏర్పాటు చేసిన 28 హోమగుండాల వద్ద తమ తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే యాగశాల ప్రాంగణంలో వేద పారాయణదారులు వేదమంత్రాలు, చతుర్వేద పారాయణం పఠిస్తున్నారు. ఆగమ శాస్త్రంలో నిర్ణయించిన విధంగా పండితులు మహాభారతం, రామాయణం, భగవద్గీత పారాయణం చేస్తున్నారు. దివ్య ప్రబంధనదారులు ప్రబంధాలను పఠిస్తున్నారు.

శనివారం శ్రీవారి పుష్కర సేవకు అంకురార్పణ ఘనంగా జరిగింది. తిరుమల ఆలయంలో మహా సంప్రోక్షణ క్రతువు ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు అర్చకులు. ఈనెల 16 వరకు నిర్వహించనున్న ఈ మహా కార్యక్రమం వేద మంత్రోచ్ఛరణల మధ్య ప్రారంభమైంది. మూడు రాష్ట్రాల నుంచి వచ్చిన 30 మంది రుత్వికులు, టీటీడీకి చెందిన మరో 14 మంది అర్చకులు రుత్వికులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాసుడి సమక్షంలో స్థాన నిర్ణయం చేసిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు విశ్వక్సేనుల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు.