అందంగా ఉన్న భార్యను అంగట్లో పెడదామనుకుని..

అందమైన అమ్మాయి భార్యగా రావాలి. ఆ అందం తనకు మాత్రమే సొంతమవ్వాలి అనుకున్నాడు. భార్య ఉండగానే మరో అమ్మాయి అందానికి ముగ్ధుడయ్యి రెండో ఇంటికి తెర తీసాడు. అయితే ఆమె అందానికి అతడే కాదు బయటకు వెళ్లిన ప్రతిసారీ ప్రతి ఒక్కరి చూపు పక్కనున్న తన భార్యవైపే పడడాన్ని సహించలేకపోయాడు. చంపేద్దామనుకున్నాడు. వ్యభిచార గృహానికి తరలిస్తే డబ్బులు వస్తాయని ఆలోచించాడు. కానీ కథ అడ్డం తిరిగి అడ్డంగా బుక్కయ్యాడు. బీహార్‌కి చెందిన సద్దాం భార్యా పిల్లలతో కలిసి ఢిల్లీలో ఉంటున్నాడు. సాఫీగా సాగిపోతున్న సంసారంలో మరో మహిళ సద్దాం కంటపడింది. ఆమె అందానికి అతడు ఫిదా అయ్యాడు. మాటకలిపాడు. పెళ్లి చేసుకుందామన్నాడు. ఆమె కూడా ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకుని ఇంకో ఇంట్లో పెట్టాడు ఆమెని. ఆమె అందమే అతడికి శాపంగా మారింది. బయటకు వెళితే భార్యపై మగాళ్ల చూపుల్ని భరించలేకపోయేవాడు. భార్యపై ఈర్ష్య, ద్వేషం పెంచుకున్నాడు. ఆమెను వదిలించుకోవాలని ముందు చంపేందుకు ప్లాన్ వేశాడు. మార్కెట్ నుంచి కత్తి కూడా తీసుకువచ్చాడు. కానీ ఇంతలోనే మనసు మార్చుకుని చంపడం కంటే వ్యభిచార గృహంలో అమ్మేస్తే డబ్బులు వస్తాయని దురాలోచన చేశాడు. వ్యభిచార గృహాల్లోని నిర్వాహకులను కలిసి ఎంత వస్తుందంటూ బేరాలు ఆడాడు. చివరికి ఓ బేరం కుదిరి రూ.1.20 లక్షలకు అమ్మేందుకు ఓ విటుడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే అక్కడ విటుడిగా ఉన్నది ఓ పోలీస్ ఇన్ఫార్మర్ అనే విషయం తెలియదు. రూ.10వేల అడ్వాన్స్ కూడా అతడికి ఇచ్చాడు. పోలీస్ అధికారులకు సమాచారం అందించడంతో అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఓ మహిళ జీవితానికి రక్షణ కల్పించారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -