ప్రియాంక అస్థిపంజరం స్వాధీనం

missing-women-murdered-her-husband-itself

ప్రేమన్నాడు.. కల్లబొల్లి మాటలు చెప్పాడు.. రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.. మూడేళ్ల కాపురానికి గుర్తుగా ఇద్దరు బిడ్డల్ని కన్నాడు. ఆపై మరోపెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యను చంపి ఆ ప్రేమ..పెళ్లి తాలూకూ జ్ఞాపకాలను సమాధి చేశాడు. ఫేస్‌బుక్‌లో ఉంచిన ఫొటో.. నల్గొండ జిల్లాకు చెందిన హంతకుడ్ని తొమ్మిదేళ్ల తర్వాత పట్టించింది.

ఇతని పేరు ఉపేంద్రా చారి. నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం మాండ్ర గ్రామవాసి. 15ఏళ్ల క్రితం తల్లిదండ్రులు, అక్క ప్రియాంకతో కలిసి ఉపేంద్రాచారి హైదరాబాద్ కు వలస వెళ్లాడు. మూడేళ్ల పాటు ఎంతో సంతోషంగా జీవించారు. ఆ తరువాత వీరి జీవితాల్లోకి మర్రిగూడెం మండలం వెంకేపల్లి కి చెందిన మోర హనుమంతు ప్రవేశించాడు. ప్రియాంకతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. అదికాస్తా ప్రేమగా మారడంతో.. 2006లో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే.. విషయం తన వాళ్లకు కానీ, ప్రియాంక తల్లిదండ్రులకు కానీ తెలియకుండా హనుమంతు జాగ్రత్తపడ్డాడు. వీరికి కుమార్తె, కుమారుడు కూడా జన్మించారు.

ఓ వైపు ప్రియాంకతో కాపురం చేస్తూనే.. మరోవైపు 2007లో తల్లిదండ్రులు చూసిన మరో అమ్మాయిని హనుమంతు పెళ్లి చేసుకున్నాడు. వెంకేపల్లిలోనే కాపురం పెట్టాడు. ఊళ్లో పొలంపనుల్లో బిజీగా ఉన్నానని ప్రియాంకను నమ్మించాడు. రాను రాను ప్రియాంక నుంచి ఒత్తిడి పెరగడంతో.. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని పథకం పన్నాడు. 2009లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను వెంకేపల్లి గ్రామానికి తీసుకొచ్చి ఇంట్లోనే హత్యచేశాడు. లారీ ట్యూబ్‌లో ఆమె మృతదేహాన్ని కుక్కి.. గ్రామ శివారులోని బావిలో పడేశాడు. ఆ బావిలో..గ్రామస్థులంతా జంతువుల కళేబరాలు, వ్యర్థాలు వేస్తుండటంతో.. ఎవరూ అటువైపు చూడలేదు.

ప్రియాంకను హత్య చేసి దర్జాగా తిరుగుతున్న హనుమంతును ఫెస్‌బుక్ ఫోటో పట్టించింది. 2008లో ప్రియాంక రెండోసారి గర్బం దాల్చినప్పుడు.. తమ్ముడు ఉపేంద్రాచారి ఆమెను కలిశాడు. నాలుగు రోజులు అక్క ఇంట్లోనే ఉన్నాడు. కొన్ని నెలల తరువాత తల్లిదండ్రులతో కలిసి వచ్చి అక్కను ఇంటికి తీసుకెళ్లేందుకు వెళ్లగా.. అక్కడ ఎవరూ కనిపించలేదు. దీంతో 2009 పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియాంకపై దిగులుతో ఆమె తండ్రి మృతి చెందాడు. అక్క ఆచూకీ కోసం తమ్ముడు ఉపేంద్ర చారి ఏళ్ల తరబడి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. హనుమంతు స్వగ్రామమైన వెంకేపల్లిలో ఉపేంద్రచారి ఆరా తీశాడు. ఇటీవల ఫేస్‌బుక్‌లో హనుమంతు ఫోటోను ఉపేంద్రచారి గుర్తు పట్టాడు. ఆ ఫోటోలో మరో మహిళ, పిల్లలతో హనుమంతు ఉండటాన్ని గమనించి.. ఎల్బీనగర్ , మర్రిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హనుమంతును అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించే సరికి ప్రియాంకను హత్య చేసిన విషయాన్ని హనుమంతు అంగీకరించాడు.

ప్రియాంకను చంపినట్లు హనుమంతు ఒప్పుకోవడంతో.. అతడ్ని స్పాట్‌కు తీసుకెళ్లిన పోలీసులు సీన్ రీ క్రియేట్ చేయించారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి .. అస్తిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ట్యూబ్‌ నుంచి పుర్రె, ఎముకలు, జుట్టు, చెప్పులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే.. శరీర అవశేషాలు ప్రియాంకవేనా కాదా అనేది నిర్దారించేందుకు డీఎన్‌ఏ టెస్ట్ నిర్వహిమన్నారు పోలీసులు. ప్రియాంకపై అనుమానంతోనే హనుమంతు హత్య చేశాడని పోలీసులు తెలిపారు. పిల్లలు ఇద్దరు క్షేమంగా ఉన్నారని వారిని ఇతరులకు అమ్మేశాడని చెప్పారు. దొరికిన ఆధారాలను డీఎన్‌ఏ టెస్టులకు పంపుతామని రిపోర్ట్ వచ్చిన తరువాత పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామని నాంపల్లి సీఐ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

ఎక్కడో అక్కడ ప్రియాంక బతికే ఉంటుందని ఆశించిన ఉపేంద్ర చారి.. ఇక ఆమె లేదన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. ప్రియాంకను అత్యంత కిరాకతకంగా హత్య చేసిన హనుమంతును కఠినంగా శిక్షించాలని పోలీసుకు విజ్ఞప్తి చేశాడు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.