సీఎం చంద్రబాబే కుట్రపూరితంగా రైలు తగల బెట్టించారు : వైయస్ జగన్

ys-jagan-padayatra

సీఎం చంద్రబాబే కుట్రపూరితంగా తునిలో రైలు తగుల బెట్టించారని ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కాపు ఉద్యమ సమయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందన్న జగన్.. ఇక ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరాయని విమర్శించారు.

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 235వ రోజుకు చేరింది. శనివారం తూర్పుగోదావరి జిల్లా తునిలో జగన్ పాదయాత్ర కొనసాగింది. జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం ఆయన వెంట అడుగులేశారు. శనివారం ఉదయం రౌతులపూడి మండలం డీజేపురం నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి తుని నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కొత్తవేలంపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు, తల్లూరు జంక్షన్, జగన్నాథగిరి మీదుగా తుని వరకు సాగిన పాదయాత్ర..2700కిలోమీటర్ల మైలు రాయిని దాటింది.

కాపు రిజర్వేషన్ల ఉద్యమం సమయంలో కుట్ర పూరితంగా రైలును తగుల బెట్టించింది చంద్రబాబే అని జగన్ ఆరోపించారు. రైలును తగులబెట్టిన కేసులో 75శాతం మంది వైసీపీ కార్యకర్తలనే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. దేవుడు ఆశీర్వదించి వైసీపీ ప్రభుత్వం అదికారంలోకి వస్తే రైలు దగ్ధం కేసులో నమోదైన తప్పు డుకేసులన్నింటిని ఎత్తివేస్తానని జగన్ హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు పాలనంతా అవినీతి మయమైందని జగన్ మండిపడ్డారు. . ఇసుక మట్టి గడ్డి భూములు సహా దేన్నీ వదలలేదని విమర్శించారు.