పిల్లలు పుట్టకపోవడానికి కారణం.. లోదుస్తులేనా?

inner wear, sperm count

ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య వీర్య క‌ణాల లోపం. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం అనేది ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ప్రతి ఐదుగురి పురుషుల్లో ఒకరికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటోందని సర్వేలు చెబుతున్నాయి. ప్రతి ఆరు జంటల్లో ఒక జంట గర్భధారణ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కొంతమందికి సంతానప్రాప్తి కలగక పోవడానికి మగవాళ్లు వేసుకొనే బాక్సర్లు, బ్రీఫ్‌లు కూడా కారణం కావొచ్చు అంటున్నారు పరిశోధకులు.

సంతాన ప్రాప్తి అనేది వీర్య కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. మగవాళ్లు వేసుకునే బాక్సర్లు, బ్రీఫ్‌లు వీర్య వృద్ధిని ప్రభావితం చేస్తాయని పరిశోధకులు అంటున్నారు. ఈ అంశంపై 600 మంది పురుషులపై పరీక్షలు నిర్వహించగా బ్రీఫ్స్ లేదా జాకీలు వేసుకున్న వారిలో ప్రతికూల ఫలితాలు కనిపించాయట. అయితే బాక్సర్లు వేసుకున్న వారిలో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉందని హ్యూమన్ రిప్రోడక్షన్ జర్నల్ లో ప్రచురించిన సర్వేలో వెల్లడించారు.

ఇది ఇలా ఉంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా సంతాన ప్రాప్తికి అడ్డుకాబోదని యూరాలజిస్ట్‌లు అంటున్నారు. వాస్తవానికి వీర్య వృద్ధి ఒక్కో వారం ఒక్కోలా ఉంటుందని వారు చెబుతున్నారు. లోదుస్తులవల్ల స్పెర్మ్ కౌంట్ పడిపోతుందనే అంశంపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.