సేమ్‌ సీన్‌ రిపీట్‌..టీమిండియాకు ఘోరపరాజయం

Stuart Broad celebrates with team mates
Stuart Broad celebrates with team mates

తొలి టెస్టులో ఓడిపోయినా చివరి వరకు పోరాడారు.. కానీ, రెండో టెస్ట్‌లో ఆ ప్రయత్నం కూడా చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ పేసర్ల దెబ్బకు భారత బ్యాట్స్‌మెన్‌ విలవిలలాడిపోగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది.. ఫలితం టీమిండియా ఇన్నింగ్స్‌ తేడాతో ఘోర ఓటమి చవి చూసింది.బ్యాట్స్‌మెన్ మరోసారి సమష్టిగా విఫలమైన వేళ రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 150 పరుగులు కూడా చేయలేకపోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 107 పరుగులు మాత్రమే చేసి కోహ్లీ సేన ఆలౌట్‌ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ 396 పరుగులు చేసి ఇన్నింగ్‌ డిక్లేర్‌ చేసింది. వోక్స్‌, బెయిర్‌ స్టో అద్భుతమైన బ్యాటింగ్‌ ప్రతిభను కనబర్చారు.. వోక్స్‌ 130 పరుగులు చేయగా.. బెయిర్‌స్టో 93 పరుగులు చేశారు.

ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆరంభం నుండే భారత్ తడబడింది. మురళీ విజయ్ డకౌటవగా.. రహానే, పుజారా, కోహ్లీ నిరాశపరిచారు. పాండ్యా, అశ్విన్ కాసేపు పోరాడడంతో స్కోర్ వంద దాటగలిగింది. అశ్విన్‌ 33 పరుగులు, పాండ్యా 26 పరుగులు చేశారు.. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ అంతా స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ అశ్విన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఇంగ్లాండ్ బౌలర్లలో ఆండర్సన్ మరోసారి భారత పతనాన్ని శాసించాడు. బ్రాడ్ కూడా రాణించడంతో భారత్‌కు ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. ఫలితంగా మరో రోజు మిగిలుండగానే ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియా చిత్తు చిత్తుగా ఓడిపోయింది.. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లీష్ టీమ్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది.