గీతిక సూసైడ్‌ కేసులో మరో మలుపు

ప్రేమ వ్యవహారం మరో మెడికోను బలితీసుకుంది. మనసు పడిన వ్యక్తితో బతకలేక పోతున్నాననే బాధ. కుటుంబసభ్యుల మాటలను కదనలేని నిస్సాహాయ స్థితి. చివరికి మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడింది మెడికో గీతిక. వేధింపులు, ఒత్తిడితోనే ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరకడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఇంతకీ ఆ నోట్‌లో ఏముంది?

నా జీవితం ఇలా అయిపోతుందని ఊహించలేదు అంటూ మొదలైంది మెడికో గీతికా రెడ్డి సూసైడ్ నోట్. అందరు అమ్మాయిల్లాగే నాకు భర్త, కుటుంబం అతని ప్రేమ కావాలని అనుకున్నా, కానీ నా జీవితంలో నేను ఓడిపోయా అమ్మ. అంటూ సాగింది ఈ లేఖ. తను లేకుండా బతకలేను. అలా అని తనతో కలిసి బతకలేను. అందుకని వెళ్లిపోతున్నా… అంటూ సూసైడ్ నోట్ ముగించింది గీతికా రెడ్డి.

ఆత్మహత్య వ్హేసుకున్న మెడికో సూసైడ్

తిరుపతిలోని శివజ్యోతి నగర్‌లో ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న మెడికో గీతికా రెడ్డి సూసైడ్ నోట్ ఇది. గీతిక ఎస్వీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సెకండ్ ఇయర్ స్టూడెంట్. గీతిక ఆత్మహత్యకు చదువు ఒత్తిడి, వేధింపులే కారణమని మొదట అందరూ భావించారు. కానీ ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్‌ నోట్‌తో కొత్త కోణం వెలుగు చూసింది. గీతిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని వెల్లడైంది.

సూసైడ్‌ నోట్‌లో గీతిక ప్రస్తావించిన తను అంటే సుదర్శన్ రెడ్డి అని తెలుస్తోంది. కడపకు చెందిన సుదర్శన్‌రెడ్డికి ఇదివరకే పెళ్లయింది. అయినప్పటికీ అతడు గీతికతో ప్రేమలో పడి లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ పెళ్లి ఇష్టంలేని గీతిక కుటుంబం… ఆమెకు ఎగ్జామ్స్ తర్వాత మరో యువకుడితో వివాహం చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. దీంతో తీవ్ర ఒత్తిడికిగురైన గీతిక… అతడితో కలిసి బతకలేక… కుటుంబసభ్యుల మాట కాదనలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

Medico Student Gethika
Medico Student Gethika

గీతిక స్వస్థలం కడప జిల్లా. కొన్నేళ్ల కిందటే తండ్రి చనిపోయారు. దీంతో గీతిక చదువు కోసం ఆమె తల్లి హరితాదేవి తాను చేస్తున్న టీచర్ ఉద్యోగం మానేశారు. తిరుపతికి వచ్చి శివజ్యోతినగర్‌లో నివాసం ఉంటున్నారు. సోమవారం నుంచి కాలేజీలో పాథాలజీ ఇంటర్నల్‌ పరీక్షలు ఉన్నాయి. వాటి కోసం ప్రిపేర్ అవుతానంటూ ఆదివారం మధ్యాహ్నం భోజనం చేశాక తన గదిలోకి వెళ్లింది గీతిక. కానీ సాయంత్రం అయినప్పటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపుతీసింది తల్లి హరితాదేవి. చదువుకుంటుందనుకున్న గీతిక… ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడడం చూసి విలవిల్లాడింది. వెంటనే రుయా ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు.

ఇప్పటికే అదే యూనివర్సిటీకి చెందిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకోవడంతో… గీతికా రెడ్డి కూడా వేధింపులు, ఒత్తిళ్లతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానించారు.

గీతికా రెడ్డి మరణంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వెంటనే కాలేజీలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీతోపాటు, కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి. అయితే విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న ఆస్పత్రికి వెళ్లారు. మెడికో సూసైడ్‌కు కారణాలు అడిగి తెలుసుకున్నారు. గీతిక సొంత కారణాలతోనే బలవన్మరణానికి పాల్పడ్డారని, దీనికీ కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు… సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇదివరకే పెళ్లయిన సుదర్శన్ రెడ్డి గీతికను మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? కుటుంబసభ్యులకు ఈ విషయం తెలిసిన తర్వాత అసలు ఏం జరిగింది? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.