పల్నాడులో హైటెన్షన్…బొత్సను అదుపులోకి తీసుకున్న పోలీసులు

గుంటూరు జిల్లా పల్నాడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళగిరి టోల్ గేట్ వద్ద వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. అక్రమ మైనింగ్ పై నిజ నిర్ధారణ విచారణ కోసం బొత్స, పార్టీ నేతలతో కలిసి గురజాల వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుగ్గిరాల పోలీసు స్టేషన్ కు తరలించారు. గుంటూరు తూర్పు ఎమ్యెల్యే ముస్తఫా, అప్పిరెడ్డి, కావేటి మనోహర్ నాయుడు సహా మరికొందరిని కూడా అడ్డుకున్నారు. తన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు. గురజాలలో నాలుగేళ్లుగా టీడీపీ నేతలు అక్రమ మైనింగ్‌ పాల్పడుతున్నారని, కొందరు ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ అక్రమ మైనింగ్‌ జరుగుతోందని ఆరోపిస్తున్నారు.

అటు, నడికుడిలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో గురజాల వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయన్ను స్టేషన్‌లోనే ఆపేశారు. ఈ కారణంగా జన్మభూమి ఎక్స్‌ప్రెస్ 25 నిమిషాలు లేటుగా వెళ్లింది.