కీచక ఎస్సై..‘నువ్వంటే నాకిష్టం.. నీ ఒపీనియన్‌ ఏమిటి? అంటూ..

న్యాయం చేయాల్సిన రక్షణాధికారే కీచకుడిగా మారాడు. ఓ మహిళకు ఫోన్‌ చేసి లైంగికంగా వేధిస్తుండడంతో ఆమె చివరికి ఆధారాలతో సహా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆత్మకూరు ఎస్సై వెంకట సుబ్బయ్య ఓ మహిళపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.. అర్థరాత్రుళ్లు ఫోన్‌ చేసి ఇబ్బందులు పెట్టేవాడని బాధితురాలు భర్త, పిల్లలతో కలిసి కర్నూలు జిల్లా ఎస్పీ గోపీనాథ్‌ జెట్టికి ఫిర్యాదు చేసింది. దీంతో వెంకట సుబ్బయ్యను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు… బాధితురాలి ఫిర్యాదుపై విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని అదనపు ఎస్పీ మాధవరెడ్డిని ఆదేశించారు.

బాధితురాలికి ఎస్‌ఐ ఫోన్‌చేసి ‘నువ్వంటే నాకిష్టం.. నీ ఒపీనియన్‌ ఏమిటి?’ అని బరితెగించి అడిగాడు. ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ఓ మహిళ సివిల్‌ కేసు నిమిత్తం పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ వెంకటసుబ్బయ్యకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అప్పుడు ఎస్‌ఐ వివాదంలో ఉన్న ఇరువురితో మాట్లాడి పంపించేశారు. ఆ తర్వాత విచారణ పేరుతో ఆమె ఫోన్‌ నెంబర్‌ తీసుకుని తరచూ అర్ధరాత్రిళ్లు అభ్యంతరకరంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.

గతంలో బాధితురాలి కుటుంబ సభ్యులు సారా వ్యాపారం చేస్తుండేవారు. తరచూ తనిఖీలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబం సారా విక్రయం మానుకుని కూలి పనులకు వెళ్తోంది. అయినా ఎస్‌ఐ అమె ఇంటికి చాలాసార్లు తనిఖీలకు వెళ్లేవాడు. అసభ్యకరంగా మాట్లాడేవాడు. ఈ విషయాలన్నీ బాధితురాలు మీడియా ఎదుట వాపోయింది. తాజాగా ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య ఈ మహిళకు రాత్రిళ్లు ఫోన్‌చేసి నువ్వంటే నాకిష్టమని వేధించారు. ఆమె అంగీకరించకపోవడంతో సారా విక్రయిస్తున్నావా? అని బెదిరింపులకు దిగారు. ఎస్‌ఐ ఫోన్లో మాట్లాడినవన్నీ ఆమె రికార్డింగ్‌ చేసి ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ వెంటనే స్పందించి ఎస్‌ఐ వెంకటసుబ్బయ్యను వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -