క్షణికావేశంలో ఆత్మహత్యలు.. నిండు జీవితాలకి ముగింపు

తిరుపతిలో డాక్టర్ చదువుతున్న గీతిక ప్రేమకోసం, ప్రేమించిన వాడు కాదన్నాడని ఆత్మహత్య చేసుకుంది. నాన్న లేకపోయినా బిడ్డ కోసమే బతుకుతూ తను డాక్టరైతే చూడాలని కలలు కన్న తల్లికి కడుపుకోత మిగిల్చింది. డాక్టరుగా ఎందరికో ప్రాణం పోయాల్సిన ఆమె తన ప్రాణాలను తానే చేజేతులారా తీసేసుకుంది. ఊపిరికి ఉరేసింది. యువతీ యువకులు ఎందుకు ఇలాంటి ఆవేశ పూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వారు నిండు జీవితాలకు ముగింపు పలుకుతున్నారు.
జీవితానికి ప్రేమ అవసరమే.

కానీ దానికోసం ప్రాణాలు తీసుకోవాల్సినంత అవసరం మాత్రం లేదు. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఆ తరువాతే ఎవరైనా. ఓపక్క ఏమీ తెలియని టెన్త్, ఇంటర్ చదివే అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ప్రేమ పేరుతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరో పక్క అన్నీ తెలిసి ఎంతో ఉన్నత చదువులు చదువుతున్న వారు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. డాక్టర్.. ఈ పేరెంతో గౌరవప్రదమైనది. మనిషి కనిపించని దేవుడికంటే.. కనిపించే డాక్టర్నే దైవంగా భావిస్తారు. తమకొచ్చిన వ్యాధిని నయం చేస్తే మా పాలిట దేవుడివయ్యా అంటూ చేతులెత్తి నమస్కరిస్తారు.

మరి అలాంటి వృత్తిలో ఉండి కూడా, చదివిన చదువుకి న్యాయం చేయకుండా ప్రేమించిన వాడు కాదన్నాడని ఆత్మహత్య చేసుకోవడం ఎంతవరకు భావ్యం. ప్రపంచం చాలా విశాలమైంది. ప్రేమను పంచే వ్యక్తులు చాలా మందే ఉంటారు. ఎవరో ఒకరు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడే వ్యక్తులు దొరక్కపోరు. కన్నవారికి కడుపుకోత మిగిల్చి ఆత్మహత్య చేసుకుని సాధించేది ఏమీ లేదు. ఉన్నత చదువులు చదువుతున్నవారికి మంచీచెడు అన్నీ తెలుస్తాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే శక్తి ఉంటుంది. కేవలం ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదంటున్నారు మానసిక నిపుణులు కూడా. పెద్దలను ధైర్యంగా ఒప్పించాలి. ఒత్తిడిని తట్టుకోలేకపోతే.. మరే మార్గమూ కనిపించకపోతే.. మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది. కౌన్సిలింగ్ ద్వారా మానసిక శక్తిని పొందవచ్చు. అంతేకాని.. ఆత్మహత్యల ద్వారా ఏ రకమైన సమస్యలకూ ఎలాంటి పరిష్కారాలు దొరకవు.