శ్రావణ మంగళవారం రోజు హనుమంతుడిని పూజిస్తే కలిగే శుభాలు..

హృదయంలో అమితంగా ప్రేమించే తన ఆరాధ్య దైవం రాముడ్ని నిలుపుకున్నాడు, రాముని మనసు దోచుకున్నాడు హనుమంతుడు. విష్ణుమూర్తి రాముని అవతారం దాల్చినప్పుడు హనుమంతుడు శివుడిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. వీరిరువురూ కలిసి భూమిపై జరుగుతున్న అన్యాయాన్ని, అధర్మాన్ని నిలువరించి ప్రజలను ఎల్లవేళలా కాపాడుతుంటారని భక్తుల విశ్వాసం.

రాముని యొక్క ఆదేశానుసారమే హనుమంతుడు నడుచుకుంటాడు. శ్రావణమాసంలో శివపార్వతులు పూజలందుకుంటారు. అభిషేకాలు, అర్చనలతో శివుడ్ని ప్రార్థిస్తారు భక్తులు. శివాలయాలన్నీ శివనామస్మరణతో హోరెత్తుతుంటాయి. శ్రావణ మంగళవారాల్లో చేసే పూజలను, భక్తుల మొరలను శివుని రూపంలో ఉన్న హనుమంతుడు వింటాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని ఆరాధిస్తే కుటుంబంలో నెలకొన్న ప్రతికూల అంశాలు తొలగిపోతాయి.

శ్రావణ మంగళవారంలో ఆచరించే పూజలు: శివుడు, హనుమంతుడు ఉన్న ఆలయాలకు వెళ్లి ఆ రోజు హనుమంతునికి పంచోపచార పూజ చేస్తే మంచిది. మర్రి ఆకుని తీసుకుని శుభ్రంగా కడిగి హనుమ విగ్రహం ముందు కొద్ది సేపు ఉంచి దేవునికి పెట్టే తిలకంతో ఆ ఆకు మీద ‘శ్రీరామ్’ అని రాసి దాన్ని మీ ఇంట్లో ఉంచుకుంటే మంచిది. మరుసటి ఏడాది పాత ఆకుని పారే నదిలో వదిలి మరో కొత్త ఆకుమీద ఇలానే రాసి ఉంచుకుంటే శుభాలు కలుగుతాయని పండితులు చెబుతుంటారు.

అలాగే శ్రావణ మంగళవారం రోజు రామస్త్రోత్రాన్ని పఠించడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. దేవునికి బెల్లం మరియు వేయించిన శనగలు నైవేధ్యంగా సమర్పించాలి. దేవుని ముందు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఆపై శివ చాలిసా, హనుమాన్ చాలిసాలను భక్తి, శ్రద్ధలతో పఠించాలి. ఇలా చేయడం వలన అభిషేక ప్రియుడైన శివుడు, చాలీసా పటిస్తేనే సంతప్తి చెందే హనుమ ఆశీర్వచనాలు పుష్కలంగా లభిస్తాయి.